“అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి ఢంకా మోగించనున్న “శ్రీ సాంస్కృతిక కళాసారథి”

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ 2020 జూలై లో ప్రారంభమై, నేటి వరకు సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా, 2021 జూలై 3,4 తారీకులలో “అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021” అనే బృహత్యజ్ఞానికి శ్రీకారం చుట్టింది.

ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాలలో తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యేవిధంగా, ఒక ప్రపంచ వేదికను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో రూపకల్పన చేయబడిన ఈ కార్యక్రమానికి సుమారు 34 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు సహకరించడానికి ముందుకు రావడం విశేషం. అమెరికాలోని తానా, వంగూరి ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, హాంకాంగ్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా, మారిషస్ మొదలైన 34 దేశాల నుంచి తెలుగు కళాకారులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ రచనలు, పాటలు నృత్యం మొదలైన కళాప్రదర్శనలు అందించబోతున్నారు.

https://www.facebook.com/kavuturu/posts/10159556361051499

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ అనుగ్రహభాషణం అందించబోవడం ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేస్తోంది.

సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ “భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం గావించబోతున్నారని, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపనున్నారని, రామ్ మాధవ్, మండలి బుద్ధ ప్రసాద్, జేడీ లక్ష్మీనారాయణ, వామరాజు సత్యమూర్తి, వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించబోవడం మరింత ఆనందకరంగా, ప్రోత్సాహకరంగా ఉందని” తెలిపారు.

భారతదేశం నుండి కూడా వంశీ ఇంటర్నేషనల్, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వంటి సంస్థల సహకారంతో పాటుగా సురేఖ మూర్తి, ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, నేమాని పార్థసారథి వంటి సంగీత దిగ్గజాలు, తనికెళ్ళ భరణి, భువనచంద్ర, మురళీ మోహన్, సాయి కుమార్, సాలూరు కోటి వంటి సినీ ప్రముఖులు ఈ ప్రపంచ వేదికను అలంకరించనున్నారు.

ఈ బృహత్కార్యక్రమ నిర్వాహకులలో రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు కార్యక్రమ ముఖ్య సమన్వయకర్తలుగా, ఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. “శుభోదయం” సంస్థ స్పాన్సర్ గా, సాక్షి టీవీ, టీవీ5, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్ గా నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*