సింగపూర్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సింగపూర్‌: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ ఆధ్వర్యంలో “జయ ప్రియ భారత జనయిత్రీ” అనే కార్యక్రమం జరిగింది. 18 సంవత్సరాలు భారత వాయుదళంలో సేవలందించిన ప్రఖ్యాత సినీ గేయ రచయిత భువనచంద్ర.. ఆత్మీయ అథితిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులకు చక్కటి ప్రోత్సాహం అందిస్తూ ప్రతి పాటను తనదైన శైలిలో వ్యాఖ్యానించి ఆశీస్సులు అందించారు. సింగపూర్‌లో నివసించే 32 మంది గాయనీ గాయకులు, కవులు, పిల్లలు తదితరులు అందరూ కలిసి మాతృభూమిని కీర్తించారు. చక్కటి దేశభక్తి గీతాలు, కవితలతో భారతమాతకు సంగీత సాహిత్య నీరాజనాలు అర్పించారు.

భువనచంద్ర మాట్లాడుతూ ‘దూర దేశాల్లో ఉన్న “శ్రీ సాంస్కృతిక కళాసారథి” వంటి సంస్థలు.. పిల్లలు, పెద్దలతో కలిసి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దేశ నాయకులను, అమరవీరులను తలుచుకునే అవకాశం లభించిందన్నారు. వారి త్యాగాల గురించి భావితరాలకు కూడా తెలియజేసే విధంగా మహనీయుల ఘనతను పాటలు, కవితల రూపంలో అందించడం చాలా గొప్ప విషయం’ అని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న భువనచంద్రకు సంస్థ సభ్యులందరూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ.. మాతృభూమికి దూరంగా ఉన్న వేళ, 75వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అందరూ కలిసి దేశమాతని స్తుతిస్తూ ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీని ద్వారా సింగపూర్‌లో ఉంటున్న పిల్లలకు, ఔత్సాహిక కవులకు, గాయనీ గాయకులకు మంచి ప్రోత్సాహం అందించే అవకాశం తమ సంస్థకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బు వి పాలకుర్తి, పంపన సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. సంస్థ కార్యనిర్వాహక వర్గ సభ్యులు రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*