
హైదరాబాద్: ఓ చిన్న పల్లెటూరు నుంచి భాగ్యనగరానికి వచ్చి మీడియా రంగంలో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారామె. మీడియా రంగంలో సంస్కృతంలో ప్రావీణ్యం ఉన్న అతి కొద్దిమందిలో ఆమె కూడా ఒకరు. స్వామి వివేకానంద ఆదర్శమని చెప్పే ఆమెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఉద్యోగరీత్యా ఏ టాస్క్ చేపట్టడానికైనా వెనుకాడరామె. రాయడంలోనే కాదు విషయాన్ని ప్రెజెంట్ చేయడంలోనూ ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా, రిపోర్టర్‌గా… మొత్తంగా ఆమె ఓ ఆల్‌రౌండర్‌గా నిలుస్తున్నారు. ఆమె మరెవరో కాదు యూత్ ఐకాన్.. యాంకర్ విష్ణుప్రియ. తన బాల్యం, చదువులు, మీడియాలోకి ఎంట్రీతో పాటు ఇతర అనేక విషయాలను ఆమె ఈక్షణంతో పంచుకున్నారు.
Vishnu Priya
విష్ణుప్రియ మాటల్లోనే…
అందరికీ నమస్కారం. నా పేరు గుబ్బా విష్ణు ప్రియ రమేష్. నేను 1985 జనవరి 6న కృష్ణా జిల్లా నాగాయలంక దగ్గర్లోని ఓ చిన్న పల్లెటూరులో జన్మించాను. నా తల్లిదండ్రులు పుప్పాల శేషగిరిరావు నాగమల్లేశ్వరి. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా మా తల్లిదండ్రులు విద్య విషయంలో ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్ తర్వాత సూర్యనారాయణ శర్మ గారి ప్రోత్సాహంతో సంస్కృతంలో MA పూర్తి చేయగలిగాను. ఆ తర్వాత మా గురువు కుమార్ గారు నాకు ప్రైవేటు కళాశాలలో బోధనకు అవకాశం కల్పించారు. దీంతో పాటు నాకు అత్యంత ఇష్టమైన కవిత్వం రాయడాన్ని, పుస్తక పఠనాన్ని కూడా సాగిస్తూ వచ్చాను. 2005లో నా వివాహం జరిగింది. ఆ తర్వాత భాగ్యనగరానికి వచ్చేశాను. హైదరాబాద్‌లోని ప్రముఖ కళాశాలలో సంస్కృత అధ్యాపకురాలిగా పని చేశాను.
కరోనా దెబ్బతో ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కోవాలని పిల్లలకి చెప్పిన మాటలు ఆచరించాల్సిన సమయం వచ్చిందని అర్ధమైంది. అప్పటికే రచనా రంగంలో అనుభవం ఉండటం వలన ఆ మార్గంలో అవకాశాల కోసం వెతికాను. అవకాశాలు అంత తేలిగ్గా ఏం రాలేదు. నా రచనలు చూసి బాగున్నాయన్న వారే కానీ రాయడానికి అవకాశం ఇచ్చిన వారు లేరు. అయినా నిరుత్సాహపడలేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రయత్నించి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో ఓడిపోకూడదనే సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను. అందుకే తీవ్రమైన ప్రయత్నాలు చేశాను. చివరకు నా ప్రయత్నాలు ఫలించాయి. మీడియా రంగంలో అవకాశం వచ్చింది. ఆ తరువాత స్టూడియో18లో స్క్రిప్ట్ రైటర్ నుంచి న్యూస్ రీడర్‌గా మారాను. ఆ తర్వాత ఎస్ బి టి ఎస్ ఛానల్ లో న్యూస్ రీడర్‌గా, యాంకర్‌గా, రిపోర్టర్‌గా పనిచేస్తున్నాను.
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM RAJU గారి ప్రోత్సాహంతో యమలీల, సద్గురు సాయి లాంటి ప్రముఖ సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పే అవకాశం కలిగింది.
నాకు స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం. వివేకానందుడి ఆలోచనలు యువతకు మంచి మార్గాన్ని చూపిస్తాయి. ఆయన మాటల స్ఫూర్తితోనే ఉత్సాహంగా ముందుకు సాగుతున్నా. మనం కష్టంలో ఉన్నప్పుడు మన కంటే ఎక్కువగా కష్టపడుతున్న వారిని తలచుకుంటే మన కష్టం చిన్నదిగా కనిపిస్తుంది. అప్పుడే ముందుకు సాగి ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోగలం. అవకాశాల కోసం ఎప్పటికప్పుడు నన్ను నేను సమాయత్తం చేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
–గుబ్బా విష్ణు ప్రియ రమేష్
Be the first to comment