
న్యూఢిల్లీ, హైదరాబాద్: 1893లో చికాగో విశ్వవేదికపై స్వామి వివేకానంద ప్రపంచానికి అందించిన సందేశం ఇప్పటికీ అనుసరణీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు. హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో ఉన్న‘వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్’ శాఖ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా పాల్గొన్న రమణ చారిత్రాత్మక చికాగో ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. అమెరికాలో స్వామి వివేకానంద తొలిసారి ఉపన్యసించి సెస్టెంబర్ 11, 2021తో 125 ఏళ్లుపూర్తయ్యాయి. అయితే, అప్పట్లోనే స్వామీజీ భారతదేశ భవిష్యత్తును దర్శించగలిగారని ఎన్వీ రమణ అన్నారు. స్వాతంత్రోద్యమంలో మనం చెల్లించుకున్న భారీ మూల్యాల్ని వివేకానంద తాను జీవించి ఉండగానే ఊహించారని ఆయన చెప్పారు. అందుకే, ఆయన మూఢనమ్మకాలకు, ఛాందసత్వాలకు అతీతంగా మతం ఉండాలని నొక్కి చెప్పారంటూ గుర్తు చేశారు. ఇప్పటికీ స్వామీజీ సందేశం మనకు శిరోధార్యమేనన్నారు. దేశ యువతను కూడా రమణ తమ ప్రసంగంలో ప్రస్తావించారు. డిజిటల్ యుగంలో సమాచారం మొత్తం చేతి వేళ్ల అంచుల వద్దకు వచ్చేసిందన్న ఆయన యువతీయవకులు బాగా చదవాలని, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత చేసే ప్రతీ పని దేశ నిర్మాణంలో భాగమని కూడా చీఫ్ జస్టిస్ అన్నారు.
Be the first to comment