
హైదరాబాద్: మహర్షి శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల సన్నాహకాల్లో భాగంగా విద్యానగర్‌లో ఉన్న శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో అరో అవలోకన్ శిబిరం జరిగింది. శ్రీ అరబిందో సొసైటీకి చెందిన సౌమిత్రి లక్ష్మణాచార్య ఆరంభోపన్యాసంతో శిబిరం ప్రారంభమైంది. శ్రీ అరబిందో గురించి, ఆయన సిద్ధాంతం గురించి, రామకృష్ణ మఠం ద్వారా ప్రచురితమైన పుస్తకంలో శ్రీ అరబిందో గురించి రాసిన విషయాలను లక్ష్మణాచార్య సభికులకు పరిచయం చేశారు. దేశమంటే మనుషులే కాదు మట్టి కూడా అని భారత దేశంలో అణువణువూ పవిత్రమైందేనని చెప్పారు.
శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ చాల్మయి రెడ్డి మాట్లాడుతూ శ్రీ అరబిందో సూచించిన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. మానవునిలో దివ్యత్వాన్ని ప్రేరేపించడమే హిందూ ధర్మ విశిష్టత అని చెప్పారు. విశ్వమంతా ఒకే కుటుంబమనే భావనను శ్రీ అరబిందో ప్రభోదించారని చెప్పారు.
శ్రీ అరబిందో సొసైటీకి చెందిన ములుగు శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా శ్రీ అరబిందో గురించి ప్రస్తుత తరాలకు పూర్తి స్థాయిలో తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. శ్రీ అరబిందో గురించి తెలుసుకుని జీవితాల్ని చరితార్థం చేసుకునే సమయం వచ్చేసిందన్నారు. సంపూర్ణ స్వరాజ్యం కావాలని శ్రీ అరబిందో కాంక్షించారని, ఆయన ప్రభావం అనేకమంది స్వాతంత్ర్య యోధులపై పడిందని చెప్పారు.
ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ శ్రీ అరబిందో సిద్ధాంతంతో పాటు ఆయన సమయంలో జీవించిన మహనీయుల సిద్ధాంతాలను ప్రస్తావించారు. శ్రీ అరబిందో తమ జాతీయవాద భావజాలంతో అనేకమందిలో దేశభక్తిని, స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారని చెప్పారు. అందుకే బ్రిటీష్‌వారు శ్రీ అరబిందోను బద్ధవిరోధిగా ప్రకటించారని కసిరెడ్డి చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ మాట్లాడుతూ శ్రీ అరబిందో సిద్ధాంతాలు నేటికీ ఆచరణీయమని, ఆయన సిద్ధాంతం నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. శ్రీ అరబిందో కొటేషన్స్‌ను ఆయన చదివి వినిపించారు.
ప్రముఖ కాలమిస్ట్ భాస్కరయోగి మాట్లాడుతూ శ్రీ అరబిందో సూచించిన అఖండ భారత్ గురించి చెప్పారు. అఖండ భారత్ అంటే భౌగోళిక స్వరూపం కాదని, ఆలోచనావిధానమని చెప్పారు.
ట్రైన్ ద ట్రైనర్స్ పేరుతో జరిగిన ఈ శిబిరంలో వేర్వేరు అంశాల్లో శిక్షణ ఇచ్చారు. రచయితలు, వక్తలు, నిర్వాహకులు కావాలనుకునేవారికి శిక్షణ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో ఎలా మార్పు తీసుకురావచ్చో సామాజిక మాధ్యమ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సేవాభారతికి చెందిన ఎక్కా చంద్రశేఖర్, సమాచారభారతికి చెందిన ఆయుష్ నడింపల్లి, ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్, ఇఫ్లూ మాజీ ప్రొఫెసర్ సుధాకర్, ఇతర మేధావులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, శ్రీ అరబిందో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Be the first to comment