ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌‌ సూపర్ హిట్

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేసేందుకు చేపట్టిన ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌‌ సూపర్‌‌ హిట్ అయింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌‌లో కాబోయే తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆడిటోరియంలో ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ ఉత్తమ సంతానం కోరుకునేవారు ఉత్తమమైన ఆలోచనలతో ఉండాలన్నారు. భావోద్వేగాలతో పాటు ఒత్తిళ్లకు గురయ్యేవారికి సరైన సమయంలో సరైన కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా తల్లుల ఇబ్బందులు తొలగించే యత్నం చేస్తున్నామన్నారు.

తల్లి పాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేసేందుకు దక్షిణాసియాలో మొట్టమొదటిసారి నిర్వహించిన సమావేశం ఇదని ధాత్రి మిల్క్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు డాక్టర్ సంతోష్ తెలిపారు. తల్లి పాల నిర్వహణ, తల్లిపాల బ్యాంకింగ్, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంపై ఈ సదస్సు జరిగిందన్నారు.

ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు చాలా కీలకమైన దశ అని, ఈ దశలో గర్భిణులు పాటించవలసిన సూచనలను ఈ వర్క్‌షాప్‌లో ఇచ్చామని ఆర్యజనని ఇంఛార్జ్ డాక్టర్ అనుపమారెడ్డి తెలిపారు.

ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేశామని క్లినికల్ సైకాలజిస్ట్ వృషాలీ రెడ్డి తెలిపారు.

బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇచ్చామని ఆర్యజనని టీమ్ తెలిపింది.

బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలక దశపై దృష్టి పెడుతూ, పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాల ద్వారా, సాధికార మానవ జాతిని నిర్మించాలనేదే ఆర్యజనని లక్ష్యమని వివరించింది. తేలికపాటి, శక్తిమంతమైన చిట్కాల ద్వారా అభివృద్ధి నాణ్యతను పెంచడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది.

కార్యక్రమంలో డాక్టర్ సుకుమార్ (సక్షమ్ ఫౌండేషన్‌), డాక్టర్ అశోక్ వార్షణేయ్ (ఆరోగ్య భారతి), డాక్టర్ అశ్విని కుమార్ టుప్కరీ (సేవాంకుర్), ఆర్యజనని టీమ్ సభ్యులు, ఆరోగ్య భారతి, సక్షమ్ ఫౌండేషన్ సభ్యులు, పలువురు డాక్టర్లు, ఇతర సభ్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*