ఘనంగా శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 129 వ జన్మదినోత్సవ వేడుకలు

హైదరాబాద్: పశ్చిమ దేశాల్లో యోగ శాస్త్ర పితామహులుగా ప్రఖ్యాతి పొందిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు (1893-1952) నేటి యుగంలో అత్యంత ప్రభావవంతంగా ఆధ్యాత్మిక పథ నిర్దేశం చేసిన దైవ దూతల్లో ఒకరు. ఈ మహాగురువు 129 వ జన్మదినోత్సవం ఈ సంవత్సరం జనవరి 5 న జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది జీవితాలకు మార్గనిర్దేశనం చేస్తూ పరివర్తనాత్మక శక్తి కలిగిన ఆయన బోధనలను ఒకసారి పర్యావలోకిద్దాము.

ఒక సాధువుగా, యోగం యొక్క పునరుద్ధారకుడు, దార్శనికుడైన తత్వవేత్త, కవి, రచయిత మొదలైన బహుముఖ రూపాల్లో జీవించిన అవతారుడైన యోగానందగారు అదే సమయంలో ఒక సద్గురువు మరియు జగద్గురువు కూడా. ఆధునిక కాలపు పవిత్ర గ్రంథంగా ప్రఖ్యాతి చెందిన ఆయన స్వీయచరిత్ర అయిన ఒక యోగి ఆత్మకథ [1946] చదువరులను ఉన్నత రాజయోగ ప్రాణాయామ ప్రక్రియ అయిన పవిత్రమైన క్రియాయోగ శాస్త్రానికి పరిచయం చేసింది.

ఒక దివ్య విధి

పూర్వాశ్రమంలో ముకుందలాల్ ఘోష్ గా పిలవబడిన పరమహంస యోగానందగారు 1893, జనవరి 5 న గోరఖ్ పూర్ లో ఒక సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కాశీకి చెందిన ఉత్కృష్ట గృహస్థ యోగి అయిన లాహిరీ మహాశయుల శిష్యులు. లాహిరీ మహాశయులు మరణం లేని మహావతార్ బాబాజీగారి నుండి చిరకాలంగా మరుగునపడి ఉన్న క్రియను అందుకున్నారు. ముకుందుడు పసి బాలుడుగా తన తల్లి చేతుల్లో ఉన్నపుడే లాహిరి మహాశయులు “చిట్టి తల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా! ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిద్ధ్యానికి చేరుస్తాడు.” అని ముందుగానే నిర్దేశితమైన ఆయన జీవిత కార్యాన్ని సూచిస్తూ జోస్యం చెప్పారు.
ముకుందుని బాల్యం స్థిరమైన ఆధ్యాత్మికాసక్తితోనూ, అనేక ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తులను కలుసుకోవడంతోనూ గడిచింది. ఆయన 1910 లో తన గురువైన శ్రీయుక్తేశ్వర్ ను కలుసుకొన్నారు. ఆయన శిక్షణలో చివరికి సమాధిని అందుకొన్నారు, ప్రాచీన సన్యాస సాంప్రదాయానికి చెందిన స్వామిగా దీక్ష పొందారు. ఆయనకు “యోగానంద” అనే పేరు ఇవ్వబడింది. దాని అర్ధం ”యోగంద్వారా పొందే ఆనందం.” 1917 లో రాంచీలో జీవన విధానాన్ని నేర్పే ఆశ్రమ పాఠశాలను నెలకొల్పి, భారతదేశపు వేల ఏళ్ళ నాటి పవిత్ర ఆధ్యాత్మిక శాస్త్రమైన సార్వజనిక క్రియాయోగ బోధనలను అందరికీ అందుబాటులోకి తేవడానికై యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. వర్గభేదం లేని ఈ బోధనలు ఆత్మ పరమాత్మతో ఐక్యం అవడము అనే జీవితపు అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమయే ధ్యాన పద్ధతులతో పాటు జీవితంలో సర్వతోముఖ విజయాన్ని, క్షేమాన్ని సాధించగలిగే సంపూర్ణ తాత్విక బోధలను, జీవన విధానాన్ని కలిగి ఉన్నాయి.

1920 లో ఆయనకు 27 ఏళ్ళ వయసప్పుడు తనకు కలిగిన ఒక దర్శనం ఆయనను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయలుదేరేలా చేసింది. గుర్తించాల్సిన దేమిటంటే పాశ్చ్యాత్యులు యోగానందగారిలోని శాస్త్రీయ దృక్పథాన్ని, యోగం యొక్క సార్వజనీనతను గ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఏడు యోగానందులు అందరికీ ఆచరణ యోగ్యమైన భారతదేశపు ఆత్మసాక్షాత్కార బోధనలను పాశ్చాత్యులకు ఆచరణయోగ్యంగానూ, అందుబాటులోనూ ఉండే విధంగా బోధించడానికి అమెరికాలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.

ఆయన అమెరికాలో విస్తృతంగా పర్యటించారు; ఆయన 1952 లో శరీరాన్ని విడిచేవరకూ ప్రేక్షకులతో నిండి క్రిక్కిరిసిపోయిన ఎన్నో సమావేశాల్లో ప్రసంగించడం, రచనలు సాగించడం చేస్తూనే ఉన్నారు. ఆయన మహాసమాధి తాను జోస్యం చెప్పిన రీతిలోనే — ”నేను సామాన్యునిలా శరీరాన్ని విడిచిపెట్టను. చిట్టచివరి క్షణం వరకూ పనిచేస్తూ, సచేతనంగా, భారతదేశాన్ని గురించి భగవంతుణ్ణి గురించి మాట్లాడుతూ శరీరాన్ని విడుస్తాను.“ — సంభవించింది. ఇంకా ఆయన చివరి మాటలు ఏవంటే: “ఎక్కడైతే గంగానది, అరణ్యాలు, హిమాలయ గుహలు, ఇంకా మానవులు భగవంతుణ్ణి గురించి కలలుకంటారో — అటువంటి పవిత్రమైన మట్టిని తాకిన నా శరీరం పునీతమయ్యింది.”

వర్తమానంలో ఆయన ప్రభావం

పరమహంసగారి అనేకమైన రచనలు, ప్రసంగాలు, ధార్మిక గ్రంథాలకు ఆయన చేసిన సాధికార విశ్లేషణలు, ఇంట్లో చదువుకోగలిగే పాఠాలు ఇంకా ఎన్నో; ఇవన్నీ అవ్యక్త పరమాత్మకు చెందిన సత్యాలపై వెలుగు ప్రసరిస్తాయి. విశ్వ చైతన్యమనే అనంత సాగరంలో మనిషి నేను అనే అహంకారాన్ని అధిగమించి పరమాత్మను తెలుసుకోవడంలో క్రియాయోగ ధ్యానం పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఆయన మాటల్లోనే: “ధ్యాన సాధనతో మీరు మీ హృదయంలోనే మీ వెంట మోసుకుపోగలిగిన స్వర్గం ఉందని కనుగొంటారు.”

60 కి పైగా దేశాల్లో నానాటికీ అధికమౌతున్న ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. కేంద్రాలు; ఆయన ఆదర్శానికి సజీవ ఉదాహరణలుగా జీవిస్తున్న సన్యాసులు, ఆయనను తమ సద్గురువుగా స్వీకరించిన వేలకొద్దీ సాధారణ శిష్యుల పరిణతి చెందిన జీవితాలు, ఇంకా వివిధ ఆధ్యాత్మ మార్గాలకు చెందినా ఆయన బోధించే దివ్యజ్ఞానంతో నడిపించబడే సత్కర్మాచరణ అనే సంతులిత జీవితాన్ని అనుసరించడానికి ప్రయత్నించి ఆచరిస్తున్న సాధకులు; ఇవన్నీ పరమహంస యోగానందగారి నుండి సంక్రమించిన వారసత్వం ఈ ప్రపంచంపై చూపిన గాఢమైన ప్రభావాన్ని మన కళ్ళకు కడతాయి. పరమహంసగారిచే ప్రభావితమైన జీవితాలు కలిగిన అనేక ప్రముఖ వ్యక్తులలో కొందరు — నోబెల్ బహుమతి గ్రహీత థామస్ మాన్, ఒపెరా గాయని అమెలిటా గల్లీ కుర్శి, బీటిల్ జార్జి హారిసన్, శాస్త్రజ్ఞుడైన లూథర్ బర్బాంక్, కొడాక్ కంపెనీ స్థాపకుడు జార్జి ఈస్ట్ మన్, ఆపిల్ కంపనీ స్థాపకుడు స్టీవ్ జాబ్స్, క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ.

ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో — అనేక తలాల్లో సంక్లిష్టతలను ఎదుర్కొంటున్న వేళ — బాధను వీలైనంత తగ్గించుకొంటూ ప్రేమ మరియు దయతో సామరస్య జీవనాన్ని ఎలా గడపాలో ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆయన మాటల్లో: ”వ్యక్తులు, కుటుంబాలు మరియు దేశాల మధ్య గోడలను కరిగించే వెలుగు కరుణ.”

మరింత సమాచారం కోసం: yssofindia.org

చిత్రపట సహకారం: సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

Janmotsav Commemorative Meditation — January 5, 2022

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*