భారత స్వాతంత్ర్య ఉద్యమం – స్వామి వివేకానంద పాత్ర

“నా విద్యార్థి దశలో స్వామి వివేకానందుని ఉపన్యాసాలు చదివి ఎంతో స్ఫూర్తి పొందాను ఆ స్ఫూర్తి దాయక ప్రసంగాలు నా మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. నా ఆలోచనా సరళిని, నా జీవిత”” దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాయి.మహాబుుషి , తత్వవేత్త అయిన స్వామీజీ నిద్రాణమై ఉన్న భారతజాతిని తమ బోధలతో మేల్కొలిపారు. ఇది నా తలరాత, ఇది నా దురదృష్టము అనే ధోరణి వదిలి భారతీయులు కార్యోన్ముఖులు కావాలని బోధించారు స్వామీజీ.
ఈ మాటలు దేశ ద్వితీయ ప్రధాన మంత్రి గా గొప్ప కీర్తి పొందిన లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వామి వివేకానంద గురించి ఒక సందర్భంలో అన్నవి.
అయితే స్వామీజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికిి గల కారణం దేశపునరుజ్జీవన మార్గాలను, తద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని పరోక్షంగా ప్రభావితం చేసారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం

స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల పర్యటన ముగించుకుని 1897లో మద్రాసు వచ్చారు
అప్పుడు ఎంతో మంది ఆయనను కలవడానికి వచ్చేవారు. అలా ఒకసారి మద్రాసు విశ్వవిద్యాలయం విద్యార్థులు వచ్చి ఆయనను ఇలా ప్రశ్నించారు.
‘మీరు విదేశాలకు వెళ్లి మీ వ్యక్తిత్వం తో, భారతీయ ఆధ్యాత్మిక శక్తితో ఈ ప్రపంచాన్నే జయించారు కదా,మరి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావచ్చు కదా..
అప్పుడు అది సముచితమైన ప్రశ్నే
అప్పుడు స్వామి వివేకానంద వారికి సూటిగా ఒకే సమాధానమిచ్చారు
నేను రేపే మీకు స్వాతంత్ర్యం తీసుకురాగలను
కానీ నిలబెట్టుకునే వారెక్కడ ఉన్నారు.?
మన దేశం అప్పుడు ఎదుర్కొన్న సమస్యలలో ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఒకటి. అందువల్ల స్వామీజీ తన ఉపన్యాసాలు లేఖలు మరియు సంభాషణల ద్వారా పరోక్షంగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రభావితం చేసారు.ఈ మొత్తం కార్యాన్ని జాతిని జాగృతం చేయడం (awakening India movement) అని సంక్షిప్తంగా చెప్పవచ్చు.

స్వామి వివేకానంద 1863లో కలకత్తా లో భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్తా దంపతులకు జన్మించాడు తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. బాల్యం నుండి అన్నింట్లో ప్రథమ స్థానంలో నిలిచే వాడు
జ్ఞానానికి, ఆత్మ విశ్వాసానికి రూపమా అన్నట్లు నాయకుడిగా, వ్యవహరించేవాడు. మరియు అపారమైన దయాగుణం కలిగి ఉండేవాడు. అయితే ఆధ్యాత్మిక జిజ్ఞాస వల్ల శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడై సన్యాసి గా మారాడు.అయినా ఆయనలో విశిష్టత ఏమిటంటే దేశభక్తి.
1886లో ఆయన తన దేశ పర్యటన ప్రారంభించాడు. దేశ ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను మరియు అసలు మనదేశం సమస్యలు ఎదుర్కోవడానికి మూల కారణం ఏంటో తెలుసుకుని,దాని
పరిష్కారం ఏమిటో కనుక్కున్నాడు. ప్రజలలో ఆత్మవిశ్వాసం క్షీణించిపోవడమే సమస్యలన్నిటికి మూలకారణంగా గ్రహించి అనేక మంది రాజులను, విద్యావేత్తలను, నాయకులను కలిసి వారిని సామాన్య ప్రజలలో విద్యావ్యాప్తి కై కృషి చేయమని, మరియు వారిని బలవంతులుగా చేసే భావాలను వారికి అందించమని చెప్పారు. అలా స్ఫూర్తి పొందిన వారిలో ఖేత్రీ మహారాజు ఒకరు. బాలగంగాధర్ తిలక్ కూడా స్వామి వివేకానంద నుండి ఎంతో స్ఫూర్తి పొందాడు. ఎందుకంటే ఆంగ్లవిద్య ప్రభావానికి లోనైన భారతీయులు భారతదేశంలో ప్రాచీన విషయాలను సంస్కృతిని దూషించి, దోషాలను మాత్రమే చూపించి, భారతీయుల ఆత్మ విశ్వాసం పై దెబ్బకొట్టి, ఆత్మగౌరవాన్ని దిగజార్చే సంఘ సంస్కర్తలే తప్ప భారతదేశ సాంస్కృతిక వైభవం గుర్తించి సరియైన రీతిలో, ఆత్మవిశ్వాసం కలిగించేలా బోధించేవారు కరువైన వేళ దేశ పూర్వవైభవం, ప్రస్తుత స్థితిి, సాంస్కృతిక వైభవం అన్నింటి పైన పూర్తి అవగాహనతో బోధించే భారతీయులలో ఆత్మవిశ్వాసం అనే జ్యోతిని
ప్రజ్వలింపజేసారు స్వామీజీ అందుకే ఆయన అసలు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, అక్కడి వారిలో దేశంపై గల అపోహలు తొలగించి, వారికి దేశ వైభవాన్ని గురించి అర్థమయ్యేలా చేసారు
1857లో ప్రథమ స్వాతంత్ర్య ఉద్యమం జరిగింది ఆతర్వాత రకరకాల పద్ధతులలో స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించసాగారు మన పూర్వీకులు. ఆంగ్లేయ దొరల ముందు చేతులు కట్టుకుని నిలబడి ,మాకు స్వాతంత్ర్యం ఇప్పించండి అని ప్రాధేయపడ్డ
రోజులు ఉన్నాయి. తిరుగుబాటు ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో ప్రాణత్యాగాలు కూడా జరిగాయి.1897 నుండి స్వామి వివేకానంద ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అదే ఈ భారతదేశ జాగృత ఉద్యమం. అయితే అందుకు ఆయన చాలా వినూత్న విధానాలు అనుసరించారు. ప్రజలలో దేశం పట్ల విశ్వాసం, తమపై తమకు విశ్వాసం కలిగించేలా చేయాలని,అప్పుడు వారు వారికేమి కావాలనుకున్నా సాధించుకుంటారని చెప్పేవారు. అయితే ఎన్నో తరాలనుండి మన జాతి సామాన్య ప్రజలను, స్త్రీలను, బలహీన వర్గాలను విస్మరించడం వల్లే, వారిలో ఆత్మవిశ్వాసం నశించిపోయి పరులకు బానిసలైపోయిందని, వారిని బలవంతులుగా చేసి విద్యనందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తే, ఆ దేశప్రేమ గల వ్యక్తులు స్వాతంత్ర్యం సులభంగా సంపాదించుకుంటారని చెప్పేవారు.
అయితే, స్వామి వివేకానందుడు అన్ని రంగాలలో దేశాన్ని బలోపేతం చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని భావించారు.విద్యారంగంలో అనేకమంది విద్యావంతులైన యువకులను ప్రోత్సాహించారు.నివేదితగా పేరుపొందిన మార్గరెట్ నోబుల్ ఒక పాశ్చాత్య వనిత, ఆమె స్వామీజీ ప్రసంగాలకి ప్రభావితురాలై, భారతదేశంవచ్చి స్త్రీవిద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేసింది.వ్యవసాయాన్ని విస్మరించవద్దని, ఒక విజ్ఞాన శాస్త్రములాగా నేర్చుకోమని, ఎంతో మంది యువకులకు చెప్పారు. పరిశ్రమలు స్థాపించి, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేసి దేశంలో వైజ్ఞానికరంగాన్ని బలోపేతం చేయమని జమ్ షడ్ జీ టాటా ని ఉత్తేజితం చేసారు. ఆయన కృషి వల్ల IISc ఏర్పడింది.

” భారతదేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించగోరినా మతపరమైన పెనుమార్పు ముందు రావడం అవసరం, భారతీయుడి మనస్స ఆధ్యాత్మికత మీదే ఉంటుంది.ఆధ్యాత్మిక మార్పు, వ్యక్తిత్వ నిర్మాణం తర్వాతే సామాజిక, రాజకీయ సంస్కరణలు జరగాలి”
– స్వామి వివేకానంద

 

ఎవరైనా శిష్యులు, యవకులు స్వాతంత్ర్యం గురించి అడిగితే మనుషులను తయారు చేస్తే వారే స్వాతంత్ర్యం సంపాదించుకుంటారు అనేవారు.విద్యావంతులైన యువకులు గ్రామ గ్రామాలు వెళ్ళి వారిలో చైతన్యం కలిగించాలని,దేశభక్తిని త్యాగాన్ని పెంపొందించాలని చెప్పేవారు ఆయనే స్వయంగా 1897లో పాశ్చాత్యం నుండి తిరిగి వచ్చాక దేశంలోని అనేక ప్రాంతాలలో, కళాశాలలలో, పట్టణాలలో ప్రసంగాలిచ్చారు.ఎంతో మంది యువకులను దేశంకోసం త్యాగం చేసేలా ఉత్తేజపరిచారు. అందులో సామాన్య ప్రజలతో పాటు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు కూడా ఉన్నారు.
మన స్వాతంత్ర్య సమరయోధులలో చాలామంది ఆ సమయంలో విద్యార్థి దశలో ఉన్నారు. వారందరూ స్వామి వివేకానందుల ఉపన్యాసాలు చదివారు కొందరు ప్రత్యక్షంగా విన్నారు. వారందరిలో దేశభక్తి, అచంచల విశ్వాసం ఏర్పడింది. అలా స్ఫూర్తి పొందిన వారు,స్వాతంత్ర్యసంగ్రామం సాగించారు.
స్వామి వివేకానంద నుండి స్ఫూర్తి పొందిన వారిలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి సుభాష్ చంద్ర బోస్ బాల గంగాధర తిలక్,నెహ్రూ మొదలైన వారు ముఖ్యులు. అయితేవారితో పాటు సామాన్య ప్రజలు, స్త్రీలు, పిల్లలు
సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు.అంటే స్వామి వివేకానంద స్ఫూర్తి వారి నరనరాన జీర్ణించుకుపోయింది

స్వామీజీ భారత పునర్నిర్మాణంమీద

మన ప్రవృత్తి ప్రకారం మనం ఎదగాలి. పరాయి సమాజాలు మన మీద రుద్దిన కార్యాచరణ తీరుతెన్నులను పాటించడం వృథా ప్రయాస
నేను ఇతర జాతుల వ్యవస్థలను నిరసించడంలేదు అవి వారికి సానుకూలమైనవే గాని మనకు మాత్రం కావు మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది.వారి ఇతర విజ్ఞాన శాస్త్రాల ఇతర వ్యవస్థల ఇతర సంప్రాదాయాల నేపథ్యంలో ప్రస్తుతం వారి వ్యవస్థ రూపొందింది. మనదారిలోనే మనం సాగుతాం అదే మనం చేయవలసింది కూడా..

 

 

స్వామీజీ తన విదేశీ శిష్యులనుకూడా భారతదేశ అభివృద్ధికై కృషి చేసేలా ప్రోత్సాహించారు. ఒకసారి జోసఫిన్ మెక్లౌడ్ అనే శిష్యురాలు ఇలా అడిగింది
” స్వామీజీ, మీరు మాకెంతో ఇచ్చారు మరి మేము మీకు ఏవిధంగా సహాయం చేయగలం.
అందుకు స్వామి వివేకానందుడు ఇచ్చిన సమాధానం

” భాారతదేశాన్ని ప్రేమించు”

ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని భారతదేశానికి సేవ చేయడానికి అంకితం చేసింది

మీరు ఆరాధించే ముక్కోటి దేవతలను పక్కన పెట్టండి. భారత మాతనే మీ ఆరాధ్యదేవతగా ఆరాధించండి అన్న ఆయన పిలుపు భారతదేశ స్వాతంత్ర సమరానికి ఊపునిచ్చింది

ఎంతోమంది యువకులు బ్రిటిష్ ప్రభుత్వం వారికిచ్చిన మరణ శిక్షను కూడా ధైర్యంగా ఆహ్వానించారు వారి ధైర్యం వెనుక స్వామి వివేకానంద సందేశం యొక్క స్ఫూర్తి ఎంతో ఉంది.

స్వామీజీ గురించి గాంధీజీ
“వివేకానందుని సాహిత్యం చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి ఇంకా వేయి రేట్లు పెరిగింది

సుభాష్ చంద్రబోస్

స్వామీజీ తన రచనల ద్వారా మా కాలపు విద్యార్ధులని ప్రభావితం చేసినట్లు దేశంలోని ఏ ఇతర నాయకులు చేసియుండ లేదు. నేటి స్వాతంత్ర్య ఉద్యమానికి పునాదులు స్వామీజీ యొక్క సందేశంతో ఏర్పడిందే

అరవింద యోగి
” వివేకానందుని ధైర్య సాహసాలు అసమానం ఆయన పురుష సింహంగా వెలుగొందారు ఆ మహనీయుని దివ్యశక్తి ప్రభావం ఇప్పటికి అత్యున్నత స్థాయిలో మనపైప్రసరిస్తూనే ఉంది ఆ దివ్యశక్తి పటిష్టమైనదిగా ఉత్క్రష్టమైనదిగా భారతావని ఆత్మలో భాగంగా భాసిస్తోంది.”

రమేశ్ చంద్ర మజుందార్

” స్వామి వివేకానందుడు గొప్ప యోగి మాత్రమే కాదు ఒక మహోన్నత జాతీయ వాది కూడా, ఆయన భారత జాతీయతని ఉన్నత పీఠానికి చేర్చారు మన దేశ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారు దేశ ప్రజలలో జాతీయతా భావాన్ని మేల్కొల్పడానికి తన జీవితాన్నే అంకితం చేసారు ఈనాటికీ స్వామీజీ నెలకొల్పిన జాతీయతా భావనలు ప్రజలను స్పందింపజేస్తూనే ఉన్నాయి ”

మనం భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందని చదవాలని
రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. ఆయనలో భారతదేశం యొక్క సంగ్రహాన్ని మనం చూడవచ్చు ఆయన భావనలు, ఉపదేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అనేకమంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు స్వామీజీ నుండి స్ఫూర్తి పొందినవారే. అందులో, అబ్దుల్ కలామ్ ముఖ్యులు.
స్వామీజీ, వ్యక్తి నిర్మాణం పై దృష్టి సారిస్తే వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు, ఎందరో ఆయన సూక్తులు ఆచరిస్తు దేశానికి ఆదర్శప్రాయులుగా నిలబడుతూనే ఉన్నారు.
స్వామీజీ సందేశం నిరంతరం. ఆయన కార్యం స్వాతంత్ర్యం లభించడంతో పాటు జాతి నిర్మాణం ద్వారా కొనసాగుతూనే ఉంటుంది

స్వామీజీ వాణి:

 

భారతావని నశించవలసిందేనా
అలాజరిగితే ప్రపంచం నుండి ఆధ్యాత్మికత నిష్క్రమించినట్లే
నైతిక పరిపూర్ణత మూలబడినట్లే
ఆదర్శజీవనానికి తిలోదకాలు ఇచ్చినట్లే
వాటిస్థానే విషయేచ్ఛ, భోగలాలస స్త్రీ పురుష దేవతలమల్లే తాండవిస్తాయి ధనం పౌరోహిత్యం నెరపుతూ ఉంటే మోసం దౌర్జన్యం పోటీతత్వం క్రతువులుగా పరిణమిస్తాయి
మానవఆత్మే ఆహుతి అవుతుంది కానీ ఆ స్థితి ఎన్నడూ దాపురించదు. ప్రాచీనకాలంలో మనం గర్వించదగ్గ మంచి విషయాలు ఎన్నో జరిగాయి అయితే చెడు విషయాలు కూడా లేకపోలేదు ఆమంచి విషయాలన్నిటిని మనం పదిలపరచుకోవాలి కాని భవిష్యకాల భారతదేశం ప్రాచీన భారతం కన్నా మిన్నయై విరాజిల్లాలి
మనం ప్రగతి శిఖరాలనధిరోహిస్తాం
కండబలంతో కాదు ఆధ్యాత్మిక శక్తితో
నిర్మూలాత్మక చర్యలతో కాక శాంతిపథంలో ప్రేమమార్గంలో
మన భారతదేశం ఎన్నడూ లేనంత వైభవాన్ని సంతరించుకుంటుంది ఇది నా కళ్లకు కట్టినట్టు ద్యోతకమవుతుంది

సోదరి నివేదిత
స్వామి వివేకానంద ఉపదేశాల స్ఫూర్తి పొందిన మార్గరెట్ నోబుల్, సోదరి నివేదితగా మారి భారత దేశానికి వచ్చింది. బాలికలలో విద్యావ్యాప్తి అనే స్వామి వివేకానంద ఆశయాన్ని నెరవేర్చడానికి, బాలికల పాఠశాల స్థాపించింది,స్త్రీలకు విద్య నిరాకరింపబడిన కాలంలో, కలకత్తా నగర పౌరులను ఒప్పించి బాలికల విద్యకు కృషి చేసింది. ఆ తరువాత స్వాతంత్ర్యం ఉద్యమంలో కూడా పాల్గొని జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది.

స్వామి వివేకానంద ఎప్పుడూ భౌతిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యం గురించి మాత్రమే కాక మానసిక, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం గురించి కూడా ప్రస్తావించేవారు.
అయితే స్వామీజీ స్ఫూర్తితో మనం స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు కావొస్తోంది. కానీ సాంస్కృతిక,మానసిక విషయాలలో బానిసత్వం తొలగిపోలేదు, పాశ్చాత్య అనుకరణే నాగరికతగా భావిస్తూ మహోన్నతమైన భారతీయ విలువలను పాతచింతకాయపచ్చడి అని అనుకుంటూ, తర్వాత తరాలకు కూడా అదే నేర్పిస్తున్నాం. స్వామీజీ తన ఆశలన్నీ పెట్టుకున్న యువతరం, సాంకేతికతకు, పాశ్చాత్య నాగరికతకు, మనోబలహీనతలకు లోనవుతున్నారు. ఇది రాజకీయ బానిసత్వం కన్నా ప్రమాదకరం. మనం ఇప్పుడు సాధించవలసిన స్వాతంత్ర్యం మానసిక, నైతిక, ఆధ్యాత్మిక స్థాయిలో జరిగాలి కావున ఇప్పటికీ స్వామి వివేకానంద సందేశం ఎంతో అమూల్యమైనది. ఏ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ప్రజలందరూ స్వామీజీ నుండి స్ఫూర్తి పొందారో, అదే విధంగా జాతి పునర్నిర్మాణం కోసం, జాతి ఆత్మగౌరవం కోసం, నేటి యువతగా మనం ఆయన సందేశాన్ని గ్రహించి ఆచరించే అవసరం చాలా ఉంది. స్వామీజీ సందేశం మన బలహీనతలన్నిటిని నివారించి, మన మీద, దేశం మీద, మనకి విశ్వాసం కలిగించి దేశపునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేలా శక్తినందిస్తుంది.
స్వాతంత్ర్యం సాధించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంలో

స్వామీజీ అన్నట్లు
” ఇప్పటివరకూ మనం బాగానే చేసాం, ఇకముందు ఇంకా బాగా చేద్దాం”

 

 

సేకరణ:
స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవిత గాథ
స్మృతి పథంలో స్వామి వివేకానంద
నా భారతం అమర భారతం
భారతదేశ భావి భాగ్యోదయం

 

జనవరి 12, జాతీయ యువజన దినోత్సవం మరియు
అమృతోత్సవాల సందర్భంగా

– ప్రశాంతి, రామకృష్ణ మఠం వాలంటీర్, హైదరాబాద్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*