వివేకానంద డే క్యాంపెయిన్‌కు టీటా సంపూర్ణ మద్దతు

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు తెలంగాణ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా మద్దతిచ్చింది. ఫిబ్రవరి 13కు మద్దతుగా టీటా ఆధ్వర్యంలో హైదరాబాద్ టీ హబ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ వివేకానందుడి భాగ్యనగర పర్యటన గురించి వివరించారు. తాను ప్రసంగించడానికి ముందు ప్రదర్శించిన స్వామి వివేకానంద డాక్యుమెంటరీలోని అంశాలపై చర్చించారు. స్వామి వివేకానంద- జెంషెడ్‌జీ టాటా‌కు మధ్య జరిగిన చర్చ గురించి వివరించారు. స్వామి వివేకానంద సలహా టాటా రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన వైనాన్ని వివరించారు.

అనంతరం ప్రసంగించిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ ఆధ్యాత్మికత ప్రాధాన్యం గురించి వివరించారు. ఐటీ ఉద్యోగులు పనిచేసే చోట సేక్రెడ్ స్పేస్ లేదా స్పిరిచువల్ స్పేస్ ఉండాలని అక్కడ భారతీయ యోగుల చిత్రపటాలు ఉంచాలని సలహాఇచ్చారు. ధ్యానం చేసుకునేందుకు వీలుగా ఈ స్పిరిచువల్ స్పేస్ ఉంచాలని సూచించారు.

తర్వాత మాట్లాడిన జర్నలిస్ట్ నారాయణరావు ఫిబ్రవరి 13 ప్రాధాన్యతను వివరించారు. స్వామి వివేకానంద ఏడు రోజుల భాగ్యనగర పర్యటనను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు నాలెడ్జ్ వీక్ జరపాలనుకున్న తెలంగాణ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏడు రోజుల్లో స్వామి వివేకానంద జీవితంలోని ఏడు ముఖ్యమైన అంశాలపై లోతుగా చర్చించాలని టీటా సభ్యులకు సలహాఇచ్చారు. ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించాలన్న క్యాంపెయిన్‌కు మద్దతు తెలపడంపై టీటాకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలన్న క్యాంపెయిన్‌కు మద్దతుగా కార్యక్రమం నిర్వహించిన సందీప్ మక్తలను నారాయణ రావు అభినందించారు.

చివరగా ప్రసంగించిన సందీప్ మక్తల ఫిబ్రవరి 13కు సంపూర్ణ మద్దతు పలికారు. ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలనే క్యాంపెయిన్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వివిధ దేశాల నుంచి టీటా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వామీజీలు సమాధానాలిచ్చారు. కార్యక్రమం ప్రారంభంలో సందీప్ మక్తల తమ టీటా ద్వారా ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాల గురించి, తమ టీమ్ గురించి సభకు వివరించారు.

స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించి ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరైన భారీ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగించడం స్వామి వివేకానంద జీవితంలో అదే తొలిసారి. ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారు. హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి స్వామి వివేకానంద వివరించారు. భారత దేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసింది.

వామి వివేకానంద భాగ్య నగర పర్యటన, చారిత్రక ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యూత్ కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు. అనేకమంది మేధావులను, విద్యావేత్తలను, విద్యార్ధినీ విద్యార్ధులను కలుస్తున్నారు. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. సంతకాల సేకరణ చేస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే తమ మద్దతును తెలియజేశారు.

భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన బాల గంగాధర్ తిలక్ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకూ అనేకమంది స్వాతంత్ర్య పోరాట వీరులకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానందతో భాగ్యనగరానికున్న అనుబంధం తెలంగాణకే గర్వకారణం. స్వామి వివేకానంద పాదస్పర్శతో భాగ్యనగరం పవిత్రభూమిగా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలని తెలంగాణ యువత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*