మట్టిని రక్షించేందుకు దంపతుల వినూత్న క్యాంపెయిన్

www.eekshanam.com

మట్టిని రక్షించేందుకు దంపతుల వినూత్న క్యాంపెయిన్

హైదరాబాద్: మట్టిని రక్షించాలంటూ ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ చేస్తున్న ఉద్యమానికి ఓ జంట అంకితమైంది. భార్యాభర్తలైన సదావ్రత్, శృతి సేవ్ సాయిల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సదావ్రత్ గృహిణి అయిన తన భార్యతో కలిసి మట్టిని రక్షించు క్యాంపెయిన్ ఉధృతంగా చేపట్టారు. సోషల్ మీడియాతో పాటు, వీధుల్లోనూ, రహదారులపైనా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను జాగృతం చేశారు. సద్గురు జగ్గీవాసుదేవ్ యూకే నుంచి భారత్ వరకూ 100 రోజుల్లో 30 వేల కిలోమీటర్ల పాటు 26 దేశాల్లో ఒంటరిగా మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తూ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సదావ్రత్, శృతి సేవ్ అందరి దృష్టినీ ఆకర్షించారు. నేలతల్లిని కాపాడుకోకపోతే ఆహార కొరత, నీటి సంక్షోభం, జీవ వైవిధ్యం గతి తప్పడం, వ్యవసాయ భూములు బీడు వారడంతో సహా మానవజాతి మనుగడకే ముప్పు ఏర్పడుతుందంటూ ప్రత్యేక వస్త్రధారణ ద్వారా ప్రజలను జాగృత పరిచారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా వీరితో ఫొటోలు దిగటానికి పోటీపడ్డారు. క్యాంపెయిన్‌లో తన తల్లిదండ్రులైన చిట్టా శివప్రసాద్, జానకితో పాటు ఇతర కుటుంబసభ్యులు, స్నేహితులు సహకరించారని సదావ్రత్ తెలిపారు.

వృత్తిరీత్యా లాయర్ అయిన శ్రీజ కూడా సేవ్ సాయిల్ ఉద్యమం కోసం నడుం కట్టారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీజ కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సద్గురు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీజ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ముఖంపై నేలతల్లి పెయింటింగ్ వేయించుకున్నారు. ఒకవైపు ప్రస్తుతమున్న భూమి కాగా మరో వైపు భవిష్యత్తులో ఎదురవ్వబోయే ప్రమాదాన్ని చిత్రీకరించుకున్నారు. ఈ పెయింటింగ్ చూసిన వాళ్లంతా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*