స్వామి బోధమయానంద నోట RRR మాట

హైద‌రాబాద్: స్వచ్ఛ భార‌త్ అనేది స్వచ్ఛ మ‌న‌స్సు ఉంటేనే సాధ్య‌మౌతుంద‌ని రామ‌కృష్ణ మ‌ఠం అధ్య‌క్షులు స్వామి బోధ‌మ‌యానంద చెప్పారు. హైద‌రాబాద్ రామ‌కృష్ణ మ‌ఠంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మంలో భాగంగా వంద‌లాది మంది విద్యార్ధినీ విద్యార్ధులను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు. ప్రాచీన భార‌త దేశం మూలాల‌ గురించి, గ‌తం గురించి బాగా తెలుసుకోవ‌డం వ‌ల్ల గొప్ప భ‌విష్య‌త్తును నిర్మించేందుకు వ‌ర్త‌మానం అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని స్వామి వివేకానంద చెప్పార‌ని స్వామి బోధ‌మ‌యానంద గుర్తు చేశారు. రేడియంట్ ఇండియా, రెసిలియంట్ ఇండియా, రిస‌ర్జంట్ ఇండియా అంటూ మూడు ర‌కాల భార‌త్‌ల గురించి బోధ‌మ‌యానంద చెప్పారు. ప్రాచీన‌ భార‌త్ గొప్ప‌గా వెలిగింద‌ని, మ‌ధ్య భార‌త్ అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొని నిలిచింద‌ని, ప్ర‌స్తుత భార‌త్ విశ్వ‌గురువుగా పున‌రుత్థానం చెందుతోంద‌ని బోధ‌మ‌యానంద వివ‌రించారు.

 

కార్య‌క్ర‌మానికి అతిథిగా వ‌చ్చిన తెలంగాణ హైకోర్ట్ సీనియ‌ర్ కౌన్సిల్ ర‌విచంద‌ర్ మాట్లాడుతూ లింగ వివ‌క్ష లేకుండా పిల్ల‌ల‌ను పెంచాల‌ని సూచించారు. ఆడ‌, మ‌గ పిల్ల‌ల మ‌ధ్య బేధ‌భావం లేకుండా పెంచితే మంచి స‌మాజం నిర్మాణ‌మౌతుంద‌న్నారు. విద్యార్థుల‌కు సొంత ఆలోచ‌నా సామ‌ర్థ్య‌ము, వ్య‌క్తిత్వ‌ము, క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌మ‌ని చెప్పారు. ధ‌ర్మం కోసం పోరాడాల‌ని, త‌ప్పును వ్య‌తిరేకించ‌డం త‌ప్పు కాద‌న్నారు. సోష‌ల్ మీడియాకు బానిస‌లు కావొద్ద‌ని ర‌విచంద‌ర్ విద్యార్థుల‌కు సూచించారు.

 

ముఖ్య వ‌క్త‌గా హాజ‌రైన డెక్స్‌టెరిటీ వ్య‌వ‌స్థాప‌కుడు శ‌ర‌ద్ వివేక్ సాగ‌ర్ మాట్లాడుతూ పేద‌ల మ‌న‌సు చూసి చ‌లించే గుణం ఉందా అని విద్యార్ధుల‌ను ప్ర‌శ్నించారు. చ‌లించే గుణం ఉంటే వారిని ఆదుకునే ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేసుకోవాల‌ని, స్వామి వివేకానంద ఇదే సూచించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. స్వామి వివేకానంద సాహిత్యాన్ని చ‌దివితే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోగ‌లిగే నేర్పు వ‌స్తుంద‌న్నారు.

 

కార్య‌క్ర‌మంలో యోగా మాస్ట‌ర్ లివాంక‌ర్ సార‌ధ్యంలో విద్యార్ధులు చేసిన యోగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. బాల‌బాలిక‌లు ఆల‌పించిన దేశ‌భ‌క్తి గీతాలు అల‌రించాయి.

 

కార్య‌క్ర‌మంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ ఎక్స‌లెన్స్ అధ్యాప‌కులు, వాలంటీర్లు, పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*