మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

గుజరాత్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

Updated: 14-03-2018 06:17:44

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ బుధవారం రణరంగాన్ని తలపించింది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. మైక్రోఫోన్లను విరగొట్టి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఓ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ కల్పించుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో సభలో గందరగోళం చెలరేగడంతో విక్రమ్‌ను సభ నుంచి సస్పెండ్ చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్రీష్ దెర్ విక్రమ్‌కు మద్దతిస్తూ మాట్లాడారు. స్పీకర్ వద్దని హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా తీవ్ర విమర్శలు చేశారు. 
 
బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ పంచల్ కల్పించుకుని అమ్రీష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వెల్‌లోకి వెళ్లి నిరసన చేపట్టారు. ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైక్ విరగొట్టి బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్‌పై విసిరారు. దీంతో సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
 
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత మరోసారి కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అమ్రీష్ సభలోకి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేపై దాడిచేశారు. దీంతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యేలు అమ్రీష్‌ను చుట్టుముట్టి ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.