Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

ఎక్తా నగర్ / హైదరాబాద్, అక్టోబర్ 5, ఈ క్షణం: తెలంగాణలో మౌలిక వసతుల కల్పన, రోడ్డు నెట్‌వర్క్ విస్తరణకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్‌లోని నర్మద జిల్లా ఎక్తా నగర్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రదేశంలో సోమవారం ప్రారంభమైన ‘చింతన్ శివిర్–2026’ రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మంత్రి కోమటిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కేంద్రమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, నిధుల మంజూరు, జాతీయ రహదారుల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.
హైదరాబాద్ ఈస్ట్ జోన్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ను మంజూరు చేయాలని మంత్రి కోరారు. రెండో దశ మెట్రో విస్తరణలో భాగమైన మియాపూర్–ఎల్‌బీనగర్ లైన్‌ను హయత్‌నగర్ వరకు పొడిగించనున్నందున, మెట్రోతో సమన్వయం ఉండేలా ఈ డబుల్ డెక్కర్ ప్రాజెక్టును 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే రూ.545 కోట్లతో మంజూరైన NH-65 ఎల్‌బీనగర్–మల్కాపూర్ 6+2 లేన్ల పనుల్లో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆర్‌ఈ వాల్‌కు బదులు వయాడక్ట్ విధానంలో నిర్మాణం చేపట్టాలని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR): సంగారెడ్డి–చౌటుప్పల్ (161.5 కి.మీ) ఉత్తర భాగానికి త్వరగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దక్షిణ భాగాన్ని కూడా సమాంతరంగా చేపట్టాలని విజ్ఞప్తి.
పర్వతమాల కింద 5 రోప్‌వేలు: యాదగిరిగుట్ట, నల్గొండ హనుమాన్ హిల్, నాగార్జునసాగర్, మంథని రామగిరి కోట, నిజామాబాద్ ఖిల్లా రామాలయంలలో రూ.1,230 కోట్లతో రోప్‌వేల ప్రతిపాదన.
NH-65 & NH-765 ఎలివేటెడ్ కారిడార్లు: హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల విస్తరణ తుది అనుమతులు, శ్రీశైలం ఎన్‌హెచ్‌పై నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్.
CRIF & సేతు బంధన్: 33 రోడ్డు అభివృద్ధి పనులకు రూ.1,227.75 కోట్లు, కొత్తగూడెం, సుల్తానాబాద్, నల్గొండ జిల్లా పగిడిపల్లి–నడికుడి సెక్షన్‌లో 3 ROB/RUBలకు ఆమోదం.
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య భవిష్యత్ రోడ్డు కనెక్టివిటీని బలోపేతం చేసే హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే DPR ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీనిని తెలంగాణ డ్రైపోర్ట్, బందర్ పోర్ట్ స్పర్ కనెక్టివిటీతో అనుసంధానిస్తే పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని వివరించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమర్పించిన నివేదికలు, విజ్ఞప్తులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీఈలు బి.వి.రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్ పాల్గొన్నారు.