
పానగల్లు ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు
- పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరిపాలనా అనుమతి
- వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక క్షేత్రంగా పానగల్ మార్పు..
- పర్యాటక శాఖ ముమ్మర ఏర్పాట్లు
నల్లగొండ, ఈక్షణం, అక్టోబర్ 23: నల్లగొండ జిల్లాలోని పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు.
పానగల్‌లోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు, సమీపంలోని నీటి వనరులను సమగ్రంగా అభివృద్ధి చేసి, వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను రూపొందించింది. మొత్తం రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతి ఇచ్చింది.
ఈ నిధులను పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త పర్యాటక యూనిట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న పర్యాటక సదుపాయాల అభివృద్ధి, ఆధునికీకరణకు వినియోగించనున్నారు. పనులను చేపట్టి పూర్తి చేసేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రముఖ క్షేత్రం. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా నల్లగొండ జిల్లాలో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.







