
Breaking News: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా గుట్టురట్టు..
- సన్న బియ్యంలో దొడ్డు బియ్యం కలిపి అమ్ముతున్న ముఠా..
- కర్మన్‌ఘాట్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
- 25 కేజీల బ్యాగులో కేవలం 22 కేజీలు మాత్రమే నింపుతూ మోసం..
- ఇది పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో నడుస్తున్న దందా అని తేల్చేసిన ఏసీపీ రవీందర్ రెడ్డి..
హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: హైదరాబాద్ నగరంలో పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా పాలిష్ చేసి, సన్న బియ్యంలో కలిపి బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న భారీ దందా వెలుగులోకి వచ్చింది. నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో రైస్ డిపోలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ రాకెట్‌ను భగ్నం చేశారు. ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉందని, పకడ్బందీగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోందని ఏసీపీ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.
తూనికల్లోనూ భారీ మోసం.. 25 కేజీల బదులు 22 కేజీలే!
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అసాఘిక శక్తులు అక్రమంగా సేకరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి. కర్మన్‌ఘాట్‌లోని వివిధ రైస్ డిపోలు మరియు గోదాములపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
అక్కడ దొడ్డు రేషన్ బియ్యాన్ని అత్యాధునిక యంత్రాల ద్వారా పాలిష్ చేసి, వాటిని రంగు మార్చి నాణ్యమైన సన్న బియ్యం బస్తాల్లోకి మారుస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, వినియోగదారులను మోసం చేసేలా 25 కేజీల బస్తాలో కేవలం 22 కేజీల బియ్యం మాత్రమే నింపుతూ భారీ మోసానికి పాల్పడుతున్నట్లు తనిఖీల్లో తేలింది.
పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో నడుస్తున్న దందా: ఏసీపీ రవీందర్ రెడ్డి
ఈ ఘటనపై ఏసీపీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పేదల బియ్యాన్ని అక్రమంగా దోచుకుని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది సాధారణమైన అక్రమం కాదని, వెనుక బలమైన నెట్వర్క్, పెద్దల బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ రాకెట్ నడుస్తోందని ఆయన తెలిపారు.
గోదాములను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని, ఈ అక్రమ తతంగంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. నగరంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా మరింత కఠినతరం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.







