Breaking News: వరి వేస్తే నష్టమే.. ప్రత్యామ్నాయ పంటలే మేలు: కలెక్టర్

సూర్యాపేట, క్షణం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని.. రానున్న రోజుల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లాలని సూచించారు.

శనివారం కలెక్టరేట్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.

నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ(SRSP) తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సమృద్ధిగా నీటి లభ్యత లేదని కలెక్టర్ తెలిపారు. దీంతో సాగునీటి విడుదలపై స్పష్టత లేని పరిస్థితి ఉందన్నారు.

జిల్లాలోని 190 పెద్ద చెరువుల్లో చాలా వరకు 25 నుంచి 50 శాతం నీటితోనే ఉన్నాయని చెప్పారు. భూగర్భ జలాలు కూడా ఆశించిన స్థాయిలో రీచార్జ్ కావడం లేదన్నారు.

ఆగస్టు 8వ తేదీకి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు వరి నాట్లు వేస్తే పంట కోత నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. అప్పటివరకు వర్షాలు లేకపోతే.. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోతే వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.

జిల్లాలో ఇంకా 2.35 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభం కావాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రాంతాల రైతులు ప్రస్తుత వర్షపాతం, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంట ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  • Lakmé Peach Milk Crème with 2% PRO-CERAMIDE & PEPTIDES provides intense hydration and strengthens your skin’s barrier fo…
  • Powered by PRO-CERAMIDE, this moisturizer instantly repairs your skin’s barrier and protects it from environmental aggre…
  • With PEPTIDES AND GLYCERINE, this crème locks in moisture and improves hydration to deliver a plump, dewy glow from with…

రైతుల్లో పంట మార్పిడిపై అవగాహన కల్పించేందుకు రైతులతో మాట–పంట మార్పిడికి బాట’ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

ఈ నెల 10వ తేదీ నుంచి 10 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి అధికారి కనీసం 10 మంది రైతులను వ్యక్తిగతంగా కలిసి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించనున్నారు.

తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. గ్రామస్థాయిలో రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగు, వాటి ప్రయోజనాలను రైతులకు వివరించనున్నారు.

వరి స్థానంలో కందులు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించనున్నారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. సాగునీటి కష్టాలు తొలగి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్‌లో వరుణ యాగం’ నిర్వహించనున్నట్లు తెలిపారు.

యాదగిరిగుట్ట అర్చకుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నాణ్యమైన 6 కిలోల సన్న బియ్యం అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెస్ ఛార్జీలను 40 శాతం పెంచామని చెప్పారు. బాలికలకు కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలోని తొండ గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply