Breaking News: భగ్గుమన్న నల్గొండ.. బీజేపీ, కాంగ్రెస్ కోడిగుడ్లు, టమాటాలతో దాడులు

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనకు దిగాయి. అనంతరం దీనికి ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వరుస పరిణామాలతో పోలీసులు అప్రమత్తమై కీలక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న ఆరోపణలకు నిరసనగా నల్లగొండలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలపై శ్రీనగర్ కాలనీలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంపైకి కోడిగుడ్లు, టమాటాలు విసిరి, కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కటౌట్, ఫ్లెక్సీలను చించివేయడంతో పాటు దిష్టిబొమ్మను దగ్ధం చేసి, మంత్రి కటౌట్‌ను కూడా తగులబెట్టినట్లు సమాచారం.

బీజేపీ కార్యకర్తలు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ లేరని సమాచారం. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల జోలికి వస్తే కాంగ్రెస్ కార్యాలయాలను తగులబెడతామని హెచ్చరించినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగానే నల్లగొండలో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.

మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గడియారం సెంటర్‌లోని ఇందిరాభవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తలను నియంత్రించే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా, మంత్రి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు గడియారం సెంటర్‌లో నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని తక్షణమే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని, నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు, క్రమశిక్షణ ఉన్నాయని పేర్కొంటూ.. బీజేపీ ఇదే విధంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేకనే బీజేపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ ఆందోళనకు ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లినట్లు సమాచారం. దేవరకొండ రోడ్డులో ఉన్న ఆయన ఇంటిపై దాడి చేశారు.

ఆ సమయంలో వర్షిత్ రెడ్డి ఇంట్లో లేరని, ఆయన తల్లి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారని సమాచారం. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్దకు వచ్చి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు కిటికీల అద్దాలను పగులగొట్టినట్లు ఆమె ఆరోపించారు.

ఇంట్లోని సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, తాను అడ్డుకున్నానని వర్షిత్ రెడ్డి తల్లి శ్రీదేవి ఆరోపించారు. సుమారు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఇంటిపైకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని, తన తమ్ముడిపై కూడా దాడి చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు అక్కడే ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ప్రారంభమైన బీజేపీ–కాంగ్రెస్ రాజకీయ ఘర్షణ నల్లగొండకు చేరడంతో స్థానికంగా ఉద్రిక్తత మరింత పెరిగింది. ఒక పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా మరో పార్టీ నేత కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ఆ తర్వాత వ్యక్తిగత నివాసంపై దాడి ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.

ఇరుపార్టీల శ్రేణులు పరస్పరం హెచ్చరికలు చేసుకోవడంతో పోలీసులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నల్లగొండలోని పార్టీ కార్యాలయాలు, ముఖ్యమైన రాజకీయ కేంద్రాల వద్ద భద్రతను మరింత పెంచే అవకాశం ఉంది.

Leave a Reply