తెలంగాణకు డిఫెన్స్‌ హబ్‌ దిశగా మరో అడుగు..

హైదరాబాద్‌, ఈ క్షణం: తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్‌, స్పేస్‌ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ను ఆహ్వానించారు.

సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026ను ప్రారంభించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఈ మేరకు పలువురు ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాజ్‌నాథ్‌ సింగ్‌తో సీఎం సమావేశమై తెలంగాణలో రక్షణ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం వివరించారు. రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే ఎక్స్‌పో మరింత ప్రతిష్టాత్మకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

డిఫెన్స్‌ ఎక్స్‌పోలో ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. భారత వైమానిక దళానికి చెందిన విమానాలతో పాటు సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహకరించాలని కోరారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ వంటి రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలతో పాటు డీఆర్‌డీఓ ప్రయోగశాలలు డిఫెన్స్‌ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా కేంద్రం సహకరించాలని సీఎం కోరారు.

విదేశీ రక్షణ శాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం వివరించారు. రక్షణ శాఖ సూచనల మేరకు మొత్తం 1,500 ఎకరాలు అవసరమైతే మరో 750 ఎకరాలు సేకరించి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే అంగీకరించినట్లు సీఎం తెలిపారు.

ఈ భూమిని ఎకరా ప్రాతిపదికన కాకుండా మొత్తం భూమికి ఏటా కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాలకు కేటాయించనున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రెండు పర్యాయాలు లీజును పొడిగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, డాక్టర్‌ మల్లు రవి, సురేష్‌కుమార్‌ షెట్కార్‌, పోరిక బలరాం నాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కర వేణుగోపాల్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply