Breaking News: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఎమ్మెల్యే సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు (Disqualification) వేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ గతంలో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పూర్తిగా కొట్టివేసింది.

ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీ-ఫామ్‌పై ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

దానం నాగేందర్ పార్టీ మారినందున ఆయనపై ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-Defection Law) కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన చట్టబద్ధంగా పార్టీ మారలేదని పేర్కొంటూ స్పీకర్ ఆ పిటిషన్లను కొట్టివేశారు.

స్పీకర్ తీర్పు రద్దు: దానం నాగేందర్‌పై అనర్హత ఫిర్యాదును తోసిపుచ్చుతూ స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

ఎంపీగా పోటీ పరిగణనలోకి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి, ప్రచారం చేయడాన్ని కోర్టు ప్రధాన ఆధారంగా స్వీకరించింది.

అనర్హత వేటు ఖరారు: దానం స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని వదులుకున్నారని స్పష్టం చేస్తూ ఆయన శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.

చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు, దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోకపోవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.

ఏప్రిల్ 23–2024 నుండి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అంటూ ప్రకటించిన తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని, ఒక గంట సమయం ఇవ్వాలని ఆలోపు ఈ తీర్పు సస్పెండ్ చేయాలని కోరిన దానం నాగేందర్ తరపు న్యాయవాదులు. దానం నాగేందర్ తరపు న్యాయవాదుల అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉపశమనం దొరికే అవకాశం లేదని, ఉప ఎన్నిక తప్పదని చెప్తున్న బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు.

ఈ తీర్పు మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేలలో తీవ్ర కలకలం రేపింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతుండటంతో, వారి భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply