Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

మహబూబ్నగర్/దేవరకద్ర, ఈ క్షణం: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ ఇసుక దందా తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడి అండదండలతో వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారంటూ స్థానిక రైతులు రోడ్డెక్కారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని అధికారుల తీరుపై నిలదీశారు.
స్థానిక రైతులు, నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రముఖ ఊకచెట్టు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోజూ పదుల సంఖ్యలో లారీల్లో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా దందా కొనసాగుతోందని రైతులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే అనుచరులైన రవి, రవికాంత్ రెడ్డిలు దగ్గరుండి మరీ రాత్రిపూట, పగటిపూట తేడా లేకుండా ఊకచెట్టు వాగును తవ్వేస్తూ ఇసుకను బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
అధికారం అండతో దందా: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్ రెడ్డి కనుసన్నల్లోనే ఊకచెట్టు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు.
అనుచరుల హల్చల్: ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు రవి, రవికాంత్ రెడ్డిలు దగ్గరుండి మరీ ఇసుక లారీలను తరలిస్తున్న వైనం.
భూగర్భ జలాలు ఖాళీ: వాగులో అడ్డగోలుగా ఇసుక తోడేస్తుండటంతో చుట్టుపక్కల పంట పొలాల్లో బోర్లు ఎండిపోయి వ్యవసాయం దెబ్బతింటోందని రైతుల ఆవేదన.
అధికారుల మౌనం: అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం.
లారీలను అడ్డుకున్న రైతులు మాట్లాడుతూ.. తమ కళ్లముందే వాగుల నుంచి ఇసుకను దొంగిలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఊకచెట్టు వాగులో అక్రమ ఇసుక తోడేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇసుక దందాను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.