
నల్గొండలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.. కొత్త కార్యవర్గం ఎన్నిక..
- నేడు, రేపు 10 వేల మంది ఉపాధ్యాయులతో భారీ సదస్సు.. కొత్త కార్యవర్గం ఎన్నిక!
- 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నల్గొండలో కౌన్సిల్ సమావేశాలు..
- ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ ఆగ్రహం..
నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: తెలంగాణరాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ వివరాలను వెల్లడించారు.
సంఘం ప్రారంభమై 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర పూర్తి చేసుకున్న తరుణంలో, తొలిసారిగా నల్గొండ మట్టిపై ఈ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగడం ఎంతో గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
10 వేల మందికి పైగా ఉపాధ్యాయుల హాజరు!
ఈ రెండు రోజుల మహాసభలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 10,000 మందికి పైగా ప్రతినిధులు, ఉపాధ్యాయులు హాజరుకానున్నారని భిక్షం గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 72,417 ఆన్లైన్ ప్రాథమిక సభ్యత్వాలు కలిగి ఉన్న ఏకైక ఏకోపాధ్యాయ ప్రతినిధి సంఘం పీఆర్టీయూ టీఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ మహాసభల వేదికగానే 2026-28 సంవత్సరాలకు గాను నూతన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక/ఎన్నిక ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం!
గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల సుదీర్ఘ పెండింగ్ సమస్యలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ (PRC), బదిలీలు మరియు ప్రమోషన్ల అంశాల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కౌన్సిల్ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రమశిక్షణ సంఘం రాష్ట్ర చైర్మన్ కోమటిరెడ్డి నర్సింహా రెడ్డి, పీఆర్టీయూ నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాలం నారాయణ రెడ్డి, మేకల జానా రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.







