చండూరు అయ్యప్ప ఆలయానికి రూ. 30 లక్షల విరాళం

చండూరు ఈక్షణం, నవంబర్ 16: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. అయ్యప్ప మాల ధరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తన సతీమణి లక్ష్మితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చండూరులో శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, విరాళాలు అందించి సహకరించిన దాతలకు పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

తాను ఇప్పటికే రెండు రోజుల క్రితం తన వంతుగా ఆలయ నిర్మాణానికి రూ. 20 లక్షల ఆర్థిక సహకారం అందించానని గుర్తుచేసిన ఆయన, సోమవారం మరో రూ. 10 లక్షలు (మొత్తం రూ. 30 లక్షలు) విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది ప్రతి ఒక్కరూ దైవ కార్యాల్లో భాగస్వాములు కావాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. “దేవుడు కొందరివాడు కాదు, అందరివాడు. దైవం విషయంలో రాజకీయాలు, కులం అనే భేదాలు లేవు.. మనందరం ఒకటే. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి” అని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.