Breaking News: వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్‌లపై భారీ సైబర్ దాడులు..

హైదరాబాద్ / న్యూఢిల్లీ ఈక్షణం: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే దిగ్గజ ఆర్థిక, చెల్లింపుల సంస్థలైన వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard), జేపీ మోర్గాన్ (JPMorgan)లపై భారీ సైబర్ దాడులు జరిగాయి. హ్యాకర్లు జరిపిన ఈ దాడుల్లో భారీ సంఖ్యలో కస్టమర్ల సున్నితమైన వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు సదరు సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. నేరుగా ఈ కంపెనీల ప్రధాన సర్వర్లపై కాకుండా, వాటికి సేవలు అందించే థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు (వెండార్ల) వ్యవస్థల్లోకి చొరబడి సైబర్ నేరగాళ్లు ఈ డేటా చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది.

ఈ సైబర్ దాడి ఘటనపై వీసా స్పందిస్తూ.. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో తమకు సేవలు అందించే థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై హ్యాకర్లు దాడి చేశారని వివరణ ఇచ్చింది. తమ ప్రధాన నెట్‌వర్క్ సురక్షితంగా ఉన్నప్పటికీ, థర్డ్ పార్టీ వెండార్ వ్యవస్థల ద్వారా కొంత డేటా ప్రభావితమైనట్లు పేర్కొంది.

మరోవైపు మాస్టర్‌కార్డ్ సైతం డేటా లీక్ అంశాన్ని ధృవీకరించింది. ఈ సైబర్ దాడిలో కస్టమర్ల ఈమెయిల్ ఐడీలు, చిరునామాలు (అడ్రస్‌లు) లీక్ అయ్యాయని వెల్లడించింది. అయితే, ఈ ఘటన వల్ల ఇబ్బంది పడిన బాధిత కస్టమర్లకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని మాస్టర్‌కార్డ్ భరోసా ఇచ్చింది.

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం జేపే మోర్గాన్ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది. తమకు సాంకేతిక సేవలు అందించే ఓ వెండార్‌పై హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడి కస్టమర్ల డేటాను లీక్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ వెండార్‌తో కలిసి భద్రతా లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నట్లు వెల్లడించింది.

కస్టమర్ల ఈమెయిల్, చిరునామాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినందున, బ్యాంకులు లేదా కార్డ్ కంపెనీల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లు, ఓటీపీ (OTP) అభ్యర్థనల పట్ల వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.