
Breaking News: మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ దాడులు
- రూ. 40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసులో ఏకకాలంలో తనిఖీలు..
- తెలంగాణ రాజకీయాల్లో కలకలం!
- సత్తెనపల్లిలోని ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం వ్యవహారం..
- మనీలాండరింగ్ కోణంలో రెండు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు!
హైదరాబాద్ / నిర్మల్ ఈక్షణం: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి మొత్తం రెండు చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నాయి. సుమారు రూ. 40.96 కోట్ల విలువైన సీఎంఆర్ (CMR) ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతుండటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం..
సత్తెనపల్లిలో రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ (ARS Industries) రైస్ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో భారీ గోల్మాల్ జరిగినట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది.
ధాన్యం కొరత: ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో ఏకంగా 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గతంలోనే తనిఖీల్లో తేల్చారు.
రూ. 40.96 కోట్ల నష్టం: మాయమైన ధాన్యం విలువ సుమారు రూ. 40.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గతంలో నమోదైన కేసులు: ఈ అక్రమాలపై పౌరసరఫరాల శాఖ ఫిర్యాదు మేరకు గతంలోనే రేఖా నాయక్‌పై BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4) తో పాటు నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) కింద క్రిమినల్ కేసు నమోదైంది.
మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల ఆరా..
రాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు, రూ. 40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్‌లో జరిగిన మనీలాండరింగ్ (నిధుల అక్రమ మళ్లింపు) కోణంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా తరలించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించారు? ఆ నగదును ఎక్కడెక్కడికి మళ్లించారు? అనే అంశాలపై కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలను ఈడీ బృందాలు పరిశీలిస్తున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.







