Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్, అక్టోబర్ 5, ఈ క్షణం: తెలంగాణలో అవినీతి అధికారుల పై అవినీతి నిరోధక శాఖ (ACB) సమర శంఖం పూరించింది. ఒక్కరోజే హైదరాబాద్ నగర పరిధిలోని రెండు వేర్వేరు కీలక ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులపై దాడులు నిర్వహించి రూ. లక్షల్లో లంచం డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక కేసులో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ పట్టుబడగా, మరొక కేసులో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ప్రైవేట్ డ్రైవర్ ఏసీబీ వలలో చిక్కారు.
జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 మెహిదీపట్నంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసిరామ్ సునీత ఒక భవన నిర్మాణదారుడి నుంచి లంచం డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ‘స్పీకింగ్ ఆర్డర్స్’ ను పక్కనపెట్టి, భవన నిర్మాణం సాఫీగా సాగేందుకు, ఎలాంటి వేధింపులు లేకుండా సహకరించేందుకు ఆమె మొత్తం రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అడ్వాన్స్/పార్ట్ పేమెంట్‌గా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాకుండా, ఆమె వద్ద లెక్కల్లో లేని మరో రూ. 2,50,000 నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు 1 (GHMC మెహిదీపట్నం): టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసిరామ్ సునీత రూ. 4 లక్షల లంచం మరియు రూ. 2.5 లక్షల అదనపు నగదుతో పట్టుబడ్డారు.
కేసు 2 (DM&HO రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి (AO-1), హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ (AO-2) మరియు ప్రైవేట్ డ్రైవర్ మద్దిరి కృష్ణయ్య (A-3) కలసి రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ చిక్కారు.
మరొక ఘటనలో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో (DM&HO) కార్యాలయ అధికారులు ఏసీబీకి చిక్కారు. అనుమతి (Licence) లేకుండా నడుస్తోందన్న కారణంతో సీజ్ చేసిన ఒక ఫిజియోథెరపీ సెంటర్‌కు తిరిగి తాళాలు అప్పగించేందుకు, ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా కొత్త లైసెన్స్ మంజూరు చేసేందుకు గాను రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణ కుమారి (AO-1), హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ (AO-2) లు మొత్తం రూ. 2,00,000 డిమాండ్ చేశారు.
వారి సూచనల మేరకు హెల్త్ ఇన్‌స్పెక్టర్ ప్రైవేట్ డ్రైవర్ మద్దిరి కృష్ణయ్య (A-3) బాధితుడి నుంచి మొదటి విడతగా రూ. 1,00,000 లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు పట్టుకున్నారు. ఆ డబ్బును కృష్ణయ్య వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.

రెండు కేసుల్లో పట్టుబడిన అధికారులు ప్రజల వద్ద నుంచి చట్టవిరుద్ధంగా లంచాలు డిమాండ్ చేసి అవినీతికి పాల్పడినట్లు తేలడంతో, వారిపై కేసులు నమోదు చేసి నాంపల్లిలోని SPE & ACB కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనువెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్: ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ విజ్ఞప్తి.