పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 16: నల్గొండ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రెండవ రోజు కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగాగ సంఘ శ్రేణుల కోలాహలంతో మార్మోగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి పైగా పీఆర్టీయూ డెలిగేట్లు హాజరయ్యారు.

సమావేశంలో భాగంగా పీఆర్టీయూ టీఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి లు అధికారికంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విచ్చేసిన పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, మనోహర్ రావుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే 72,457 ఆన్‌లైన్ సభ్యత్వాలతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ నూతన నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారంలో నూతన నాయకత్వం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై రాబోయే వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల (Graduates) ఎమ్మెల్సీ స్థానానికి పీఆర్టీయూ అధికారిక అభ్యర్థిగా సామాన్యుడిగా వచ్చి ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన నూతన అధ్యక్షుడు సుంకరి బిక్షం గౌడ్ పేరును అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ (EHS) వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, పీఆర్సీ (PRC) సాధన కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సుంకరి బిక్షం గౌడ్‌కు రాష్ట్ర పెన్షనర్ల సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం సుంకరి బిక్షం గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో గట్టిగా వినిపించేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై మూల్యం చెల్లించుకుందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు.

కనీసం ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి, గత పదేళ్లలో ప్రమోషన్లు ఇవ్వకుండా కాలయాపన చేసిన విధానాన్ని విమర్శిస్తూ.. సమస్యలను పట్టించుకోని పాలకుల అభ్యర్థులకు ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్టేనని హెచ్చరించారు. గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల కోసం నిరంతరం పరితపిస్తూ, సమస్యలపై పోరాడుతున్న తనకు పట్టభద్రులందరూ బ్రహ్మరథం పట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, జగన్మోహన్ గుప్తా, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారాయణరెడ్డి, జానారెడ్డి, గీత, వాణి విజయలక్ష్మి, కళావతి, శ్రీవిద్య, జానకి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply