పెన్షన్ రూ.4 వేలకు పెంచే అవకాశం: మంత్రి కోమటిరెడ్డి వెల్లడి

నల్గొండ, ఈక్షణం: రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న చేయూత పెన్షన్ మొత్తాన్ని భవిష్యత్తులో రూ.4 వేలకు పెంచే అవకాశం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో మామిళ్లగూడెం వద్ద ఇందిరమ్మ టవర్స్ నిర్మించి 480 ఇళ్లను పేదలకు అందించనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇళ్లు లేని వారందరికీ దశలవారీగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా పెన్షన్లు రానివారు ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన తనకు ప్రజా సేవే ముఖ్యమని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

Cheyutha Pension Hike 4000 Minister Komatireddy Venkat Reddy Nalgonda

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్లు పేదలకు ఆర్థిక భరోసాతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పిస్తాయన్నారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం 2,430 దరఖాస్తులు రాగా, 2,036 మంది అర్హత సాధించారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్లు అందిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని, తద్వారా పేదలకు సామాజిక భద్రత కల్పిస్తోందన్నారు. ఈ నెల 19 నుంచి కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రతినెలా 1,97,262 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తాజాగా మరో 27,255 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. నల్గొండ నియోజకవర్గంలో 4,259 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఐదు కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశామని, ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ జమ అవుతుందని వివరించారు. పెన్షన్లు రాని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

డీఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు. అనంతరం మంత్రి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.