Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పేరు రాష్ట్ర బీజేపీలో ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా విజయం సాధించిన బూర నర్సయ్యగౌడ్, అనంతరం 2019, 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2022లో బీజేపీ లో చేరి అదే పార్టీ తరఫున భువనగిరి నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల్లో ఆయనను రంగంలోకి దింపితే బీసీ ఓటర్లతో పాటు మేధావి వర్గాల్లోనూ ప్రభావం చూపగలరనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ హైకమాండ్ గ్రాడ్యుయేట్ స్థానానికి అమిత్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఆయన తరఫున ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమిత్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఆయన తండ్రి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అంతగా ఇష్టం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అమిత్ రాజకీయ భవిష్యత్తు ఎమ్మెల్యేగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే. ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం నుంచే ఆయన గ్రాడ్యుయేట్ స్థానంపై దృష్టి పెట్టి నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ యువ రెడ్డి అభ్యర్థులపై దృష్టి పెట్టడంతో బీజేపీ ప్రత్యామ్నాయ సామాజిక సమీకరణంపై కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని రెడ్డి వర్గానికి కేటాయిస్తే, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం రాష్ట్రస్థాయి చర్చల్లో బూర నర్సయ్యగౌడ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. నర్సయ్య గౌడ్ వ్యక్తిగత ఇమేజ్ పార్టీ లోపల, బయట సానుకూలంగా ఉన్నప్పటికీ ఎన్నికల వ్యయం భరించే సామర్థ్యంపై చర్చ జరిగినట్లు సమాచారం. గ్రాడ్యుయేట్ ఎన్నికలు విస్తారమైన భౌగోళిక పరిధిలో జరిగే కారణంగా ప్రచార వ్యయం గణనీయంగా ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ బీజేపీ సత్తా చాటాలంటే బూర స్థాయి నాయకుడు అవసరమని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
బూర నర్సయ్య గౌడ్‌కు ఉన్న గుర్తింపు, బీసీ వర్గాల్లోని అనుబంధం, విద్యావంతుల వర్గాల్లో ఉన్న పరిచయాలు ఎన్నికల సమీకరణాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆయన బరిలోకి దిగితే ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం మూడు పార్టీలూ అధికారిక అభ్యర్థుల ప్రకటనకు ముందు అంతర్గత చర్చలు, సామాజిక సమీకరణాలు, ఎన్నికల వ్యూహాలపై కసరత్తు కొనసాగిస్తున్నాయి. నర్సయ్య గౌడ్ పేరుపై బీజేపీ తుది నిర్ణయం తీసుకుంటుందా? కాంగ్రెస్ అమిత్ రెడ్డి ని అధికారికంగా ప్రకటిస్తుందా? బీఆర్ఎస్ రాకేష్ రెడ్డిని బరిలోకి దింపు తుందా? అనే అంశాలు వచ్చే కొద్ది రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.