Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డి కొత్త పార్టీనా..? రాజకీయ వేధికనా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా “తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారనున్నాయి” అని ఆయన స్పష్టం చేయడం.. కేవలం ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యగా చూడాలా? లేక తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించే ఆలోచనకు ఇది సంకేతమా? అన్న చర్చ మొదలైంది.

రాజగోపాల్‌ తాజా వ్యాఖ్యలను ఆయన గత పొలిటికల్ జర్నీతో కలిపి చూస్తే ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలి కనిపిస్తుంది. పదవిని కాపాడుకోవడం కంటే తన లక్ష్యం పైనే పోరాడేందుకు పదవిని సైతం వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే ధోరణిని మరింత విస్తృత స్థాయిలో కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. “రాష్ట్ర రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత రాజకీయ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా కొత్త తరం నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనను సూచిస్తున్నాయి. అంతేకాదు.. “అవినీతి ఎమ్మెల్యేలు, డిపాజిట్‌ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకు అవసరం లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఆయన అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

రాజగోపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఎన్నికల విజయాలు, ఓటములు, పదవులు, రాజీనామాలు, పార్టీ మార్పులు ఇలా అనేక మలుపులు కనిపిస్తాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. 2014లో అదే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం లోకల్‌ బాడీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మళ్లీ మునుగోడు అసెంబ్లీ బరిలోకి దిగాలనే నిర్ణయంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే మునుగోడు నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో నిధులు, అభివృద్ధి పనులు రావడం లేదంటూ అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. చివరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారు. ఆ సమయంలో మునుగోడుకు భారీగా అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. కానీ ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్‌ తరఫున కాకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడితో ఆయన రాజకీయ ప్రయాణం ఆగలేదు. 2023లో తిరిగి కాంగ్రెస్‌ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజగోపాల్‌రెడ్డి రాజకీయ శైలి పెద్దగా మారలేదు. మునుగోడులో మంజూరైన పనులకు నిధులు విడుదల కావడం లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై సొంత ప్రభుత్వంపైనే అసమ్మతి గళం వినిపించారు. అంటే.. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం ఒకవైపు.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మరోవైపు అనే ద్వంద్వ రాజకీయ పాత్రను ఆయన కొనసాగిస్తున్నారు. మంత్రి పదవి పై కూడా అప్పట్లో చర్చ జరిగినా.. ఆ ఆశ నెరవేరకపోవడం ఆయనలో అ సంతృప్తికి కారణమైందన్న రాజకీయ వర్గాల విశ్లేషణ ఉంది. అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలు కేవలం మంత్రి పదవి లేదా నియోజకవర్గ నిధుల అంశాన్ని దాటి.. రాష్ట్ర రాజకీయాల స్వరూపాన్నే మార్చాల్సిన అవసరం ఉందన్న స్థాయికి చేరాయి.

రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం డబ్బు, అధికారం, కులం, మతం చుట్టూ తిరిగే రాజకీయాలపై ఆయన చేసిన విమర్శలు. “ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతోంది. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేస్తున్నారు..” అని మండిపడ్డారు.  ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆయన పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని దీన్ని బట్టి తెలుస్తోంది. అంతేగాక 2009లో తన సహకారంతో గెలిచిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రెండుసారి గెలిచాక బీఆర్ఎస్ లో చేరడం తీవ్రంగా కలిచివేసింది.  ఎన్నికల సమయంలో ప్రజలకు దగ్గరగా ఉండి.. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారని ఆయన చేసిన విమర్శలు చర్చకు దారితీశాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిని ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో సంబంధాలు తెగిపోతున్నాయని అన్నారు. కులం, మతం పేరుతో రాజకీయంగా ఎదిగి.. ఆ తర్వాత వసూళ్లకు పాల్పడే నాయకులను తరిమికొట్టాలని పిలుపునివ్వడం కూడా ఆయన ప్రసంగంలో మరో ముఖ్యమైన కోణం.

రాజగోపాల్‌రెడ్డి చెప్పిన మరో మాట కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. “పదవి అనేది బాధ్యత.. కానీ కిరీటంగా భావించవద్దు” అన్న ఆయన వ్యాఖ్య.. ఆయన రాజకీయ తత్వాన్ని తెలియజేస్తోంది. గెలిచే వరకు ఒక విధంగా.. గెలిచిన తెల్లారే మరో విధంగా మారుతున్న నాయకుల పై ఆయన చేసిన విమర్శలు కూడా ఇదే కోణంలో ఉన్నాయి. ఇక నుంచి అవసరమైనప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళల కోసం పోరాటం చేస్తానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం ఆయన రాజకీయ ప్రయాణంలో కొత్త కోణం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయన రాజకీయాలు ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, పార్టీ రాజకీయాల చుట్టూనే కనిపించాయి. కానీ ఇప్పుడు యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలు వంటి విస్తృత సామాజిక వర్గాలను తన రాజకీయ కార్యాచరణలో భాగం చేయాలన్న సంకేతం ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్రను గుర్తుచేస్తూ.. వారు కూడా చట్టసభల్లో అడుగుపెట్టాలని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది కూడా ఆసక్తికరమైన రాజకీయ సంకేతమే. తెలంగాణ ఉద్యమంతో అనుబంధం ఉన్న వర్గాలు, కళాకారులు, యువత, నిరుద్యోగులు వంటి వర్గాలను ఒకే రాజకీయ చర్చలోకి తీసుకురావడం ద్వారా.. సంప్రదాయ పార్టీ రాజకీయాలకు భిన్నమైన ఒక ప్రజా వేదికను ఊహిస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ మొత్తం పరిణామాల్లో ఏపూరి సోమన్నను ప్రస్తావించడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఏపూరి సోమన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి చట్టసభల్లో అడుగుపెడతాడు. నేను మాటిస్తే వెనక్కి పోను” అంటూ ఆయన చేసిన ప్రకటన.. సాధారణ రాజకీయ ప్రశంసకు మించి కనిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాలను ప్రస్తావించడం ఈ మొత్తం పరిణామానికి కేంద్రబిందువుగా మారింది. “తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారనున్నాయి” అని రాజగోపాల్‌రెడ్డి స్పష్టంగా చెప్పడం వెనుక ఉన్న రాజకీయ ఆలోచన ఏమిటన్నదే అసలు ప్రశ్న. తమిళనాడు రాజకీయాల్లో ప్రాంతీయ అంశాలు, ప్రజా ఉద్యమాలు, వ్యక్తి కేంద్రిత నాయకత్వం, సామాజిక వర్గాల సమీకరణలు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అలాంటి రాజకీయ సంస్కృతి తెలంగాణ లోనూ రావాలంటూ రాజగోపాల్‌రెడ్డి చెప్పడం.. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ప్రయోగానికి ఆయన సిద్ధమవుతున్నారా అన్న చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి రాజగోపాల్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ఎక్కడా స్పష్టంగా ప్రకటించలేదు.  అయితే ఆయన వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి.. కొత్త తరం నాయకత్వంపై నమ్మకం.. తమిళనాడు తరహా రాజకీయాలపై ఆసక్తి.. “నా వెంట ప్రజలు ఉన్నారు” అనే ప్రకటన, ఇవన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయి. అది కొత్త పార్టీ కావచ్చు.. కొత్త రాజకీయ వేదిక కావచ్చు.. లేదా కాంగ్రెస్‌లోనే ఉండి కొత్త తరహా ప్రజా ఉద్యమ రాజకీయాలకు నాయకత్వం వహించే ప్రయత్నం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Leave a Reply