తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త రేట్లు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు హోం (జనరల్) శాఖ G.O.Ms.No.77ను ఆగస్టు 14, 2026న జారీ చేసింది. 2021 డిసెంబర్ 21న జారీ చేసిన G.O.Ms.No.120ను అధిగమిస్తూ తాజా ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.

కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాన్‌-ఏసీ, ఏసీ/ఎయిర్‌ కూల్డ్, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు వేర్వేరు టికెట్ ధరల పరిమితులను నిర్ణయించారు.

నాన్‌-ఏసీ థియేటర్లలో నాన్‌-ప్రీమియం టికెట్ ధర రూ.30 నుంచి రూ.70 వరకు, ప్రీమియం టికెట్ ధర రూ.50 నుంచి రూ.100 వరకు నిర్ణయించారు.

ఏసీ, ఎయిర్‌ కూల్డ్ థియేటర్లలో నాన్‌-ప్రీమియం కేటగిరీకి రూ.50–రూ.150, ప్రీమియం కేటగిరీకి రూ.100–రూ.200గా ధరలను ఖరారు చేశారు.

ప్రత్యేక సాంకేతిక సదుపాయాలున్న స్పెషల్ థియేటర్లలో నాన్‌-ప్రీమియం టికెట్ ధర రూ.100 నుంచి రూ.250 వరకు, ప్రీమియం/రీక్లైనర్ సీట్ల ధర రూ.200 నుంచి రూ.300 వరకు ఉండనుంది.

మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ సీటుకు రూ.100 నుంచి రూ.250 వరకు, రీక్లైనర్ సీటుకు రూ.200 నుంచి రూ.300 వరకు టికెట్ ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ప్రతి AC, Non-AC, Special Theatre, Multiplexలో కనీసం 25 శాతం సీట్లను నాన్‌-ప్రీమియం కేటగిరీలో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో GST చేర్చలేదు. వర్తించే GST అదనంగా వసూలు చేయాల్సి ఉంటుంది. అలాగే AC/Air-Cooled థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.5 maintenance charge, Non-AC థియేటర్లలో రూ.3 maintenance charge వసూలు చేయవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించిన service charges కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

G.O.Ms.No.77 cinema tickets

రూ.100 టికెట్ ధరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లలోనూ GST మరియు రూ.5 మెయింటెనెన్స్ ఛార్జీలు సాధారణంగా వర్తిస్తాయని పరిగణిస్తే, లెక్క ఇలా ఉంటుంది:

  • టికెట్ ధర: రూ.100
  • GST @ 5%: రూ.5
  • మెయింటెనెన్స్ ఛార్జీ: రూ.5
  • ఆన్‌లైన్ బుకింగ్ అయితే అదనంగా: ఆన్‌లైన్/కన్వీనియన్స్ ఛార్జీ సుమారు రూ.10–20
  • ఆన్‌లైన్ ఛార్జీపై వర్తించే GST: సుమారు రూ.2–4

ఆఫ్‌లైన్ టికెట్ మొత్తం: సుమారు రూ.110
ఆన్‌లైన్ టికెట్ మొత్తం: సుమారు రూ.122–134

అంటే, రూ.100గా కనిపించే సినిమా టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సమయంలో ఇతర ఛార్జీల కారణంగా సుమారు రూ.125–130 వరకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆన్‌లైన్ ఛార్జీలు సినిమా లేదా బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను బట్టి మారవచ్చు.

ఎయిర్‌ కూల్డ్ థియేటర్లను AC థియేటర్ల కేటగిరీలో విలీనం చేసిన ప్రభుత్వం.. వాటిని AC లేదా Non-AC కేటగిరీలోకి మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇచ్చింది.

Leave a Reply