
Eekshanam Exclusive: వడ్లు రూ.2,500.. బియ్యం రూ.10,000!
- పాత నిల్వలతో కొత్త దందా!
- ఎల్‌నినో సాకుతో సన్నబియ్యం ధరలకు రెక్కలు
- గతేడాది చౌకగా కొన్న వడ్లను గోదాంల్లో దాచి.. ఇప్పుడు అధిక ధరలకు విక్రయం
- 6.80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ.. ఈసారి సన్నాలకు పెరిగిన గిరాకీ
- రైతు అమ్మినప్పుడు తక్కువ.. వినియోగదారుడు కొన్నప్పుడు ఎక్కువ!
నల్గొండ, ఈక్షణం ప్రతినిధి: వడ్లు కొన్నప్పుడు రూ.2,300–2,500.. అదే వడ్లను మర ఆడించి బియ్యంగా మార్చాక క్వింటాలుకు రూ.10 వేలు! ఇదీ సన్నబియ్యం మార్కెట్లో కనిపిస్తున్న ధరల వ్యత్యాసం. గత వానాకాలంలో సన్న ధాన్యం దిగుబడి బాగుండటంతో రైతుల నుంచి తక్కువ ధరలకు వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు.. వాటిని నిల్వ చేసుకుని ఇప్పుడు మార్కెట్లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈసారి సన్నాల సాగు తగ్గడంతో ధాన్యానికి గిరాకీ పెరిగింది. దీంతో గతంలో రూ.2,300–2,500కు కొనుగోలు చేసిన వడ్లకే ఇప్పుడు రూ.4,500–5,000 వరకు చెల్లించేందుకు మిల్లర్లు వెనుకాడటం లేదు. రైతుకు గతేడాది దక్కని ధర ఇప్పుడు లభిస్తున్నా.. అప్పుడే పంటను అమ్ముకున్న రైతులు ప్రస్తుత ధరలను చూసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఎల్‌నినోను సాకుగా చూపిస్తూ సన్నబియ్యం ధరలను కూడా భారీగా పెంచారు.
6.80 లక్షల టన్నుల సన్నాలు… ఇప్పుడు ఎక్కడ?
గత వానాకాలంలో మార్కెట్లోకి 6.30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా మేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, మిల్లర్లు ప్రైవేటుగా 5.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతోపాటు పొరగు జిల్లాలు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా సన్న వడ్లు కొనుగోలు చేశారు. అప్పట్లో సన్న ధాన్యం సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో మిల్లర్లు క్వింటాలుకు రూ.2,300–2,500 చొప్పున కొనుగోలు చేశారు. ప్రస్తుతం అదే ధాన్యం నిల్వలకు డిమాండ్ పెరగడంతో ధరలు గణనీయంగా మారాయి.
పాత వడ్లకు కొత్త ధర.. మధ్యలో భారీ వ్యత్యాసం!
ఆగస్టులో క్వింటా రూ.7,200 ఉన్న జేఎస్సార్ (చింట్లు) బియ్యం ధర ప్రస్తుతం రూ.10 వేలకు చేరగా.. బీపీటీ ధర రూ.6,200 నుంచి రూ.9,600కు ఎగబాకింది. అంటే మూడు నెలల్లోనే క్వింటాలుపై రూ.2,800–3,400 భారం పెరిగింది. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కేజీ రూ.120కు చేర వచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈసారి సన్నాలు తక్కువ.. వడ్లకు పోటీ ఎక్కువ
ప్రస్తుత వానాకాలంలో సన్నాల సాగు తగ్గడంతో మిల్లులకు అవసరమైన ధాన్యం లభ్యతపై ఒత్తిడి పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మిల్లులు నడవాలంటే ధాన్యం తప్పనిసరి కావడంతో గతేడాది నిల్వలు పెట్టుకున్న వ్యాపారులు, చిన్న నిల్వదారుల వద్దకు మిల్లర్లు వెళ్తున్నట్లు సమాచారం. క్వింటాలుకు రూ.4,500–5,000 వరకు చెల్లించేందుకు సిద్ధ పడుతున్నారని తెలుస్తోంది. నల్లగొండలో ఓ వ్యాపారి గతేడాది క్వింటాలు రూ.2,300 చొప్పున లక్ష బస్తాల ధాన్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ధాన్యాన్ని క్వింటాలు రూ.4,500కు ఇవ్వాలని కొనుగోలుదారులు అడుగుతున్నట్లు తెలిసింది. అయితే గతంలో తక్కువ ధరకు కొన్నామని, ఇప్పుడు కూడా అదే ధరకు విక్రయించాలనే పరిస్థితి లేదని నిల్వదారులు భావిస్తున్నారు. మార్కెట్లో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో విక్రయాలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. పీఏపల్లి మండలం అంగడిపేటలో సాధారణంగా వ్యవసాయం చేసుకునే ఓ మహిళ గతేడాది సుమారు వంద బస్తాల ధాన్యాన్ని నిల్వ చేసింది. ప్రస్తుతం క్వింటాలు రూ.4,500 చొప్పున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ధర మరింత పెరుగుతుందనే ఆశతో ఆమె విక్రయానికి ఆసక్తి చూపలేదని తెలిసింది.
రైతుకు దక్కని ధర.. వినియోగదారుడికి తప్పని భారం
ధాన్యం ధరలు పెరిగితే రైతుకు మేలు జరగవచ్చు. కానీ గతేడాది పంట అమ్మేసిన రైతుకు ఇప్పుడు ఆ ప్రయోజనం దక్కదు. అదే సమయంలో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారుడు మాత్రం పెరిగిన ధరను భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌పై ఆధారపడే కుటుంబాలకు ధరల పెరుగుదల తప్పడం లేదు. పౌరసరఫరాల శాఖ మిల్లుల వారీ ధాన్యం, బియ్యం నిల్వలను పరిశీలించి, కొనుగోలు–విక్రయాల ధరలపై వివరాలు సేకరించాలి. ఆగస్టులో మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం.. నవంబరు 1 నుంచి తదుపరి విడత పంపిణీ చేపట్టాల్సి ఉంది. ఉచిత పంపిణీ ఉన్నంత మాత్రాన బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణ అవసరం లేదని భావించడం సరికాదు. నిల్వలు, సరఫరా, ధరలపై నిరంతర పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







