టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే

టేక్మాల్ / మెదక్ ఈ క్షణం, అక్టోబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మెదక్ జిల్లాలోని కీలక ప్రాంతాలను విస్మరించడంపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు, రైతుల తిరుగుబాటుకు తలొగ్గి ప్రభుత్వం కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, కేవలం జీవోలు, కాగితపు ప్రకటనలతో అన్నదాతల కడుపు నిండదని స్పష్టం చేశారు.

మెదక్ జిల్లాలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు మండలాల్లోనూ వర్షాభావం వల్ల వరి, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వెంటనే ఆ మూడు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా చంటి క్రాంతి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించామని చేతులు దులుపుకుంటే సరిపోదని, రైతులకు అందే నష్టపరిహారంపై వెంటనే స్పష్టమైన విధివిధానాలు (Guidelines) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సాగునీరు, విద్యుత్ అందక పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి రోడ్‌మ్యాప్ లేదని ఆరోపించారు.

రైతులను మభ్యపెట్టే ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించిన ఆయన, ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడ్ మండలాలను కరువు జాబితా నుంచి తప్పించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి, బోర్లు ఎండిపోయి రైతులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, విస్మరించిన మండలాలను కరువు ప్రాంతాలుగా చేర్చి ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులక్షేత్రంలో ఉద్యటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.