మంత్రాలు, చేతబడి, బాణామతి శుద్ధ మూఢనమ్మకం: ఎస్సై అరవింద్ కుమార్

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 31: సమాజంలో శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను నమ్మడం అత్యంత దురదృష్టకరమని టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్, సాంఘిక సమానత్వ సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ స్పష్టం చేశారు.

మెదక్ జిల్లా ఎస్పీ డి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం టేక్మాల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామంలో మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల గ్రామంలో కన్నతల్లిని కొడుకు హత్య చేయడం లాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ స్వాములు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆర్థికంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కేవలం విద్యతోనే మూఢనమ్మకాలు తొలిగిపోయి దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఈ అవగాహన సదస్సులో పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. సాంఘిక సమానత్వ సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ ప్రదర్శించిన సైన్స్ మ్యాజిక్ షో గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది.

  • ఇసుక నుండి నాణాలు తీయడం
  • విద్యార్థి చేతిపై కిరోసిన్‌తో మంటలు లేపడం
  • నోట్లో మంటలు లేపడం
  • పచ్చి వేపాకులపై నీటితో మంటలు లేపడం
  • ఇనుప చువ్వ నాలుకకు గుచ్చుకోవడం

వంటి భూత వైద్యులు చేసే దొంగ విద్యల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలను పక్షపాతం లేకుండా ప్రజల కళ్లముందు ప్రదర్శించి, ఇవన్నీ కేవలం కెమికల్స్, ట్రిక్స్ మాత్రమేనని నిరూపించారు.

ఈ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి, ఉప సర్పంచ్ కుమ్మరి లక్ష్మయ్య, వార్డు మెంబర్లు కే. కమలాకర్, పెద్ద దర్శనం బాలమల్లేష్, నత్తి అశోక్, కే. లక్ష్మి, గంగోల లక్ష్మి, జక్కుల పోచయ్య, షేక్ బేగం జాన్, పోలీస్ కళాబృందం సభ్యులు సురేందర్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.