కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో వెంకటేష్ అభిమానుల రచ్చ..

టేక్మాల్ / హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 30: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రసిద్ధ భ్రమరాంబ 70 ఎంఎం (Bhramaramba 70MM) థియేటర్ వద్ద వెంకటేష్ అభిమానులు అత్యంత ఉత్సాహంతో రచ్చ చేశారు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దన్నారం గ్రామానికి చెందిన వెంకటేష్ యూత్ సభ్యులు రాజు ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని భ్రమరాంబ థియేటర్ ప్రాంగణంలో హీరో వెంకటేష్ చిత్రపటానికి అభిమానులు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. థియేటర్ ఆవరణలో మేళతాళాలు, బ్యాండ్ బాజాలు మరియు టపాసుల శబ్దాలతో అభిమానులు చేసిన హంగామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సంబరాల కార్యక్రమంలో వెంకటేష్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా ముఖ్య సలహాదారులు రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సోమ సుందర్ గౌడ్, ముఖ్య నిర్వాహకుడు రాజులతో పాటు శ్రీను, మధు, పాండు, సన్నీ, వీరేశం, మల్లేశం, బద్రి, శివ మరియు మెదక్ జిల్లా, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన వెంకటేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినిమా కుటుంబ కథా నేపథ్యంతో ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.