ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఓ వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆపద్బాంధవుడిగా నిలిచారు. క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి, భారీగా వ్యయమైన ఆసుపత్రి బిల్లులో ఏకంగా రూ. 3.70 లక్షల రాయితీ ఇప్పించి బాధితులకు కొండంత అండగా నిలిచారు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాడ్లూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కుమ్మరి శంకర్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో భారీ బిల్లు కావడంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ వెంటనే స్పందించారు. తన మంత్రి కార్యాలయం ద్వారా నేరుగా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడించారు.

మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం చికిత్స బిల్లులో రూ. 3,70,000/- (మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు) భారీ రాయితీని ప్రకటించింది.

ఈ మొత్తం ప్రక్రియలో మంత్రి కార్యాలయ సహాయకులు సాగర్ స్వయంగా ముందుండి, ఆసుపత్రి యాజమాన్యంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ బిల్లులో మినహాయింపు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆపద సమయంలో మంత్రి కార్యాలయం చూపిన చొరవ తమ కుటుంబానికి ఎంతో ఆర్థిక ఉపశమనాన్ని, మానసిక మనోధైర్యాన్ని కలిగించిందని కుమ్మరి శంకర్ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు.

తమ కష్టకాలంలో ఆదుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహకు మరియు మంత్రి కార్యాలయ సహాయకులు సాగర్‌కు కుమ్మరి శంకర్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.