Eekshanam Exclusive: శంకర్ నాయక్ నిధుల పై బీఎల్ఆర్ కొరఢా..!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్), ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తాజాగా రూ.80 లక్షల అభివృద్ధి నిధుల వివాదంతో మరింత ముదిరినట్లు తెలుస్తోంది. జిల్లా మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) నుంచి దామరచర్ల మండలంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కేటాయింపు చేయించిన నిధుల వ్యవహారం ఇరువురి మధ్య విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎమ్మెల్సీ ప్రతిపాధించిన పనులకు తొలుత ఆమోదం లభించినప్పటికీ, ఆ తర్వాత శాంక్షన్ ఆర్డర్ రద్దు కావడం, పనులు నిలిచిపోవడంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న ఈ పోరు క్షేత్ర స్థాయి కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తన సొంత మండలమైన దామరచర్ల పరిధిలో వీధి దీపాలు లేని గ్రామాలు, గిరిజన తండాలను గుర్తించి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా మినరల్ ఫండ్ (డీ ఎంఎఫ్టీ) నుంచి రూ.80 లక్షలు కేటాయించేలా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లారు. ఆయా గ్రామాలు, తండాల్లో పనులు చేపట్టేందుకు సర్పంచులకు నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. ఈ పనుల ఆమోదం కోసం పంచాయతీరాజ్ ఈఈ(EE)కి పంపగా, తొలుత శాంక్షన్ లెటర్ జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ నిధుల కేటాయింపు విషయం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి వెళ్లడంతో పరిస్థితి మారింది. ఎమ్మెల్సీ ప్రతిపాదించిన పనులకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ అమలు చేయవద్దని ఎమ్మెల్యే పంచాయతీరాజ్ ఈఈపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఈఈ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లడంతో శంకర్ నాయక్ మరోసారి కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఎమ్మెల్సీకి కేటాయించిన నిధులతో పనులు ప్రారంభించాలని కలెక్టర్ సైతం ఈఈకి ఫోన్ చేసి సూచించినట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే జోక్యం చేసుకుని శాంక్షన్ ఆర్డర్ రద్దు చేయాలని కలెక్టర్‌కు చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. చివరకు పనులు ప్రారంభం కాకుండానే నిలిచిపోయాయి.

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో పంచాయతీరాజ్ ఈఈ సెలవుపై వెళ్లినట్లు సమాచారం. సెలవు ముగిసిన అనంతరం ఆయన మరో ప్రాంతానికి బదిలీ చేయించుకున్నారు. ప్రస్తుతం నల్లగొండ పంచాయతీరాజ్ ఈఈ మిర్యాలగూడకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ప్రతిపాదించిన రూ.80 లక్షల పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. గిరిజన తండాలు, గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటుకు ఉద్దేశించిన నిధులు రాజకీయ విభేదాల కారణంగా నిలిచిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిధుల వ్యవహారంపై ఎమ్మెల్యే వద్దకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అనంతరం కలెక్టర్ ద్వారా పనులకు ఆమోదం పొందేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించగా, ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ ప్రక్రియను నిలిపివేయించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌తో పాటు ఆయన వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఎమ్మెల్సీ దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య దూరం పెరగడంతో దామరచర్ల మండల కాంగ్రెస్ కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను అనుసరించాలా? ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌తో కొనసాగాలా? అన్న సందిగ్ధంలో కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీతో మాట్లాడితే ఎమ్మెల్యే వర్గం దూరం పెడుతోందనే భావన కేడర్‌లో నెలకొంది. దీంతో రెండు వర్గాల మధ్య నలిగిపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకం విషయం లోనూ ఇలాంటి విభేదాలు తలెత్తి కొన్ని చోట్ల పదవుల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా రూ.80 లక్షల నిధుల వ్యవహారం ఇరువురి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీనియర్ నేత జానా రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదనే చర్చ సాగుతోంది.

ప్రభుత్వం నుంచి ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు అందుబాటులో లేని పరిస్థితుల్లో, డీఎంఎఫ్ ద్వారా సొంత మండలంలోని గ్రామాలు, గిరిజన తండాలకు వెలుగులు తీసుకురావాలన్న శంకర్ నాయక్ ప్రయత్నాలకు రాజకీయ విభేదాలు అడ్డంకిగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఎంఎఫ్టీ నిధులు ఏ ఒక్క ప్రజాప్రతినిధి వ్యక్తిగత నిధులు కాకపోయినా, వాటి వినియోగంపై ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు చివరకు గ్రామాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు నేతల మధ్య విభేదాలు సమసి, నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని దామరచర్ల కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.