నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.

వరుణ మహాయాగం తెల్లవారుజామున 4.05 గంటలకు ప్రారంభమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన యాగశాలలో 108 మంది రుత్వికులు వేదమంత్రాల మధ్య గోపూజ నిర్వహించారు.

అనంతరం పుణ్యాహవాచనం, అంకురార్పణం, ఋష్యశృంగ పూజ, యాగ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతో నాగార్జునసాగర్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

మధ్యాహ్నం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. నాగార్జునసాగర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు స్వాగతం పలికారు.

అర్చకులు పూర్ణకుంభంతో సీఎం దంపతులను యాగశాలకు ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి దంపతులు పూర్ణాహుతి సమర్పించడంతో వరుణ మహాయాగం ముగిసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు నిండాలని ప్రార్థించారు.

చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరడంతో పాటు భూగర్భ జలాలు పెరగాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వరుణ మహాయాగాన్ని నిర్వహించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత వానాకాలంలో వర్షాల పంపిణీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

ప్రభుత్వం ఒకవైపు శాస్త్రీయ, ప్రణాళికాబద్ధమైన నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను కూడా గౌరవిస్తోందని పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రతి టీఎంసీని సమర్థంగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు సాగునీటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

వరుణ మహాయాగం కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిషన్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply