
మాదాపూర్ మటన్ మండి రైస్‌లో మనిషి పుచ్చిపోయిన పన్ను..
- ప్రశ్నిస్తే హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం..
- ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బాధితుడిపై హోటల్ నిర్వాహకుల తిరుగుబాటు..
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు..
హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 15: భాగ్యనగరంలో ఆహార భద్రత (Food Safety) ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజురోజుకూ హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, అపరిశుభ్రత ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండగా.. తాజాగా మాదాపూర్ (Madhapur) ప్రాంతంలో అత్యంత జుగుప్సాకరమైన పరిణామం చోటుచేసుకుంది.
మాదాపూర్‌లోని ఒక ప్రముఖ మండి హోటల్లో ఆర్డర్ చేసిన మటన్ మండి రైస్‌లో ఏకంగా మనిషికి చెందిన పుచ్చిపోయిన పన్ను (Rotten Human Tooth) రావడం తీవ్ర కలకలం రేపింది.
“ఏం చేసుకుంటారో చేసుకోండి!”: యాజమాన్యం అహంకారం
రైస్ తింటుండగా నోటికి పన్ను తగలడంతో దిగ్భ్రాంతికి గురైన కస్టమర్.. తక్షణమే సదరు పన్నును వేరుచేసి చూసి షాక్‌కు గురయ్యాడు. దీనిపై వెంటనే హోటల్ మేనేజ్మెంట్ను నిలదీశాడు. అయితే, కస్టమర్‌కు క్షమాపణలు చెప్పి బాధ్యత వహించాల్సింది పోయి హోటల్ యాజమాన్యం అత్యంత నిర్లక్ష్యంగా, హేయంగా ప్రవర్తించింది.
“మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. మాకేం భయం లేదు” అంటూ నిర్వాహకులు బాధితుడితో దబాయింపుగా మాట్లాడటం గమనార్హం.
పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నెట్టింట వైరల్!
ఆహారంలో మనిషి పన్ను రావడంపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుడు వెంటనే ఆధారాలతో సహా జీహెచ్ఎంసీ (GHMC) ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ, అధికారులు మాత్రం ఈ సీరియస్ అంశంపై ఏమాత్రం స్పందించడం లేదని, ఫిర్యాదును బుట్టదాఖలు చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ కావడంతో నెటిజన్లు, నగరవాసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్ల సీజ్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.







