తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీకి అరుదైన గౌరవం..

హైదరాబాద్ / బోస్టన్ ఈక్షణం, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ 50వ వార్షికోత్సవ సదస్సులో (50th Anniversary Symposium) తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ అద్దంకి దయాకర్ పాల్గొంటున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ఆవరణలోని వెక్స్‌నర్ (Wexner) భవనంలో నవంబర్ 14న ఈ సదస్సు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనుంది.

1636లో స్థాపించబడిన చారిత్రాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు.

“లీడర్‌షిప్ ఫర్ న్యూ ఎరా” (Leadership for a New Era – నూతన యుగానికి నాయకత్వం) అనే ప్రధాన ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హార్వర్డ్ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు (Alumni), ప్రముఖ విధాన నిర్ణేతలు, మేధావులు, ప్రొఫెసర్లు హాజరవుతున్నారు.

ఈ సదస్సులో ప్రపంచ ప్రఖ్యాత సీనియర్ విద్యావేత్తలు మరియు నిపుణులు నిక్ బర్న్స్ (Nick Burns), ఆంథోనీ ఫాక్స్ (Anthony Foxx), జూలియా మిన్సన్ (Julia Minson), శరద్ గోయల్ (Sharad Goel) కీలక ఉపన్యాసాలు చేయనున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో తెలంగాణ తరఫున పాల్గొనే అరుదైన అవకాశం తనకు దక్కడంపై డాక్టర్ అద్దంకి దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి నాయకత్వ విలువలు, ఆధునిక పాలనా విధానాలపై అంతర్జాతీయ మేధావులతో చర్చించేందుకు ఇది గొప్ప వేదిక అని ఆయన పేర్కొన్నారు.