Eekshanam Exclusive: మంత్రి కోమటిరెడ్డికి మళ్లీ జలపరీక్ష!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు అందించాలన్న లక్ష్యంతో ఒకప్పుడు ఉద్యమించిన నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫ్లోరైడ్‌ మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్న సమయంలో నాటి టీడీపీ ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. అసెంబ్లీలో ఫ్లోరైడ్‌ నీళ్ల బాటిల్‌ చూపించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ నీరు తాగాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన పోరాటం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో ప్రభుత్వం తాగునీటి పథకాలపై ప్రకటనలు చేయాల్సి వచ్చింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం లభిం చింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బ్రహ్మణ వెల్లంల వంటి కీలక పథకాలు కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడ్డాయి. వీటిలో బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు 2007లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. ఇలా.. నాటి ఉద్యమాల నుంచి మొదలైన జల ప్రయాణంలో కోమటిరెడ్డి పాత్ర కొనసాగింది. అయితే ఆ తర్వాత పదేళ్లపాటు ఈ ప్రాజెక్టులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి కోమటిరెడ్డి చొరవతో ఎస్‌ఎల్‌బీసీ, బ్రహ్మణ వెల్లంల, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ఇవన్నీ పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న ఆశలు చిగురిస్తున్న వేళ.. నాగార్జున సాగర్‌ జలాలను వినియోగించుకుని ఏపీ చేపట్టిన పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ వివాదం తెరపైకి వచ్చింది. నాడు కృష్ణా జలాల కోసం పోరాడిన కోమటిరెడ్డికి.. నేడు పల్నాడు ప్రాజెక్టు రూపంలో మరో పరీక్ష ఎదురైంది.

2003లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉండేది. వందలాది గ్రామాల ప్రజలు కలుషిత భూగర్భ జలాలనే తాగాల్సిన దుస్థితి. ఫ్లోరైడ్‌ బాధితుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. ఫ్లోరైడ్‌ కలుషిత నీళ్ల బాటిల్‌ను అసెంబ్లీకి తీసుకెళ్లి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు తాగాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని సభలో నిలదీశారు. అనంతరం ఫ్లోరైడ్‌ బాధిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 70ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నల్లగొండలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ ఉద్యమం జిల్లా తాగునీటి సమస్యను రాష్ట్రస్థాయిలో చర్చకు తీసుకొచ్చింది. ఫ్లోరైడ్‌ బాధితుల కోసం ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. నల్లగొండలోని పానగల్‌ రిజర్వాయర్‌ను ఆధారంగా చేసుకుని తాగునీటి పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. అప్పటి ప్రభుత్వం జిల్లాలో తాగునీటి పథకాలకు నిధులు కేటాయించినట్లు అసెంబ్లీలో ప్రకటించింది. ఏఎమ్మార్పీ కాల్వ నుంచి నీటిని తీసుకుని గ్రామాలకు సరఫరా చేసే సమగ్ర రక్షిత మంచినీటి పథకం కూడా అమలులోకి వచ్చింది. 2004 నాటికి ఈ పథకం సుమారు రూ.175 కోట్ల అంచనా వ్యయంతో 355 ఆవాసాలకు నీరు అందిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది. జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టింది. నల్లగొండలోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. 2005లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు చేపట్టినట్లు కాగ్‌ నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో బ్రహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. కోమటిరెడ్డి చొరవతో ఈ ప్రాజెక్టును నల్లగొండ కు తీసుకురావడం, 2007 సెప్టెంబర్‌ 4న అప్పటి సీఎం వైఎస్సార్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం కీలక పరిణామం. సుమారు రూ.699 కోట్ల అంచనా వ్యయంతో లక్ష ఎకరాలకు సాగునీరు, 107 గ్రామాలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పథకాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు కృష్ణా జలాల కోసం ఉద్యమించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు నీటి ప్రాజెక్టులు తీసుకురావడంలో చొరవ చూపారు.

వైఎస్సార్‌ హయాంలో శంకుస్థాపన జరిగిన బ్రహ్మణ వెల్లంల, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులు ఆ తర్వాత కూడా పూర్తికాలేదు. పనులు నెమ్మదించాయి. నిధుల కేటాయింపులు, నిర్మాణ పురోగతిలో జాప్యం కొనసాగింది. గత పదేళ్లలో ఈ ప్రాజెక్టులపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కృష్ణా జలాలు అందుతాయని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైతులు, ఫ్లోరైడ్‌ బాధిత ప్రాంతాల ప్రజలకు నిరీక్షణ తప్పలేదు. బ్రహ్మణ వెల్లంల ద్వారా సాగునీరు అందించే లక్ష్యం నెరవేరలేదు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు కూడా పూర్తి కాలేదు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ సామర్థ్యం పెంపు, లైనింగ్‌ పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. గతంలో తాను చొరవ చూపిన ప్రాజెక్టులను పూర్తి చేయించాలన్న లక్ష్యంతో పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బ్రహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలకు గణనీయమైన ఊరట లభించనుంది.

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించే లక్ష్యం నెరవేరుతుంది. మొత్తం 43.93 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే 35.18 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా 8.75 కిలోమీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు అందనున్నాయి.

బ్రహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 6.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. 2007లో వైఎస్సార్‌ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులకు ఆశించిన ప్రయోజనం అందలేదు. ఇప్పుడు పనుల్లో కదలిక రావడంతో ఈ పథకం ఎప్పుడు పూర్తవుతుందన్న ఆసక్తి నెలకొంది.

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతోంది. అంగడిపేట నుంచి మూసీ వరకు సుమారు 136 కిలోమీటర్ల మేర కాల్వ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. సుమారు రూ.4 42 కోట్లతో చేపట్టే ఈ పనులు పూర్తయితే నీటి వృథాను తగ్గించి చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. ఈ పనులపైనా ప్రస్తుతం దృష్టి సారించడంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే నల్లగొండ జిల్లాలో సాగునీటి లభ్యత పెరగడం తోపాటు తాగునీటి సమస్యలకూ ఉపశమనం లభించే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సమయంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ వివాదం తెరపైకి రావడం జిల్లాకు కొత్త ఆందోళనగా మారింది.

నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతానికి తాగునీరు అందించేందుకు అక్కడి ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు రూ.1,200 కోట్లతో 11 మండలాల్లోని 363 గ్రామాలకు, దాదాపు పది లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇందుకోసం సాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తరలించేలా ఇన్‌ టేక్‌, సొరంగం నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నీటి వినియోగంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) దృష్టి కి తీసుకెళ్లింది. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

నాగార్జునసాగర్‌ జలాలు నల్లగొండ జిల్లాకు జీవనాధారం. ఏఎమ్మార్పీతో పాటు జిల్లాలోని పలు సాగు, తాగునీటి పథకాలు ఈ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. జిల్లాలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పరిమితంగా ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో జిల్లాకు నీటి ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అభ్యంతరాలు, ఏపీ వాదనలు, కేఆర్‌ఎంబీ నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

ఫ్లోరైడ్‌ బాధితుల కోసం నాటి టీడీపీ ప్రభుత్వంపై పోరాడి తాగునీటి సమస్యను రాష్ట్రస్థాయికి తీసుకెళ్లిన కోమటిరెడ్డి.. ఆ తర్వాత వైఎస్సార్‌ హయాంలో జిల్లాకు కృష్ణా జలాలు అందించే ప్రాజెక్టుల రూపకల్పన, శంకుస్థాపనలోనూ చొరవ చూపారు. ఇప్పుడు మంత్రిగా అదే ప్రాజెక్టులను పూర్తి చే యించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఒకవైపు ఎస్‌ఎల్‌బీసీ, బ్రహ్మణ వె ల్లంల, ఏఎమ్మార్పీ పనులను పూర్తి చేయించి జిల్లాను సస్యశ్యామలం చేయాలి. మరోవైపు సాగర్‌ జలాల వినియోగంలో జిల్లా ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలి. నాడు తాగునీటి కోసం దీక్ష చేసిన నేతకు.. నేడు సాగర్‌ జలాల పరిరక్షణ, పల్నాడు ప్రాజెక్టు వివాదం రూపంలో మరో కీలక పరీక్ష ఎదురైంది. గతంలో ఉద్యమంతో సాధించిన నీటి ప్రయోజనాలను కాపాడుతూ, ఇప్పుడు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయించి జిల్లా ఆశలను నిజం చేయగలరా అన్నది ఆసక్తికరంగా మారింది.