
Breaking News: కేటీఆర్కు బహిరంగ క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..
- గతంలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన మాజీ మంత్రి..
- ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానన్న సురేఖ..
- కేటీఆర్, ఆయన కుటుంబాన్ని నొప్పించే ఉద్దేశం లేదంటూ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరణ..
హైదరాబాద్ ఈ క్షణం, అక్టోబర్ 29: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై గతంలో చేసిన వ్యక్తిగత దూషణలు మరియు నిరాధారమైన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. గతంలో రాజకీయ విమర్శల సందర్భంలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమె ఈ స్పష్టతనిచ్చారు.
కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశం తనకు ఎప్పుడూ లేదని, కేవలం రాజకీయ విమర్శల్లో భాగంగానే ఆ మాటలు అనాల్సి వచ్చిందని పేర్కొంటూ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
“ఉద్దేశపూర్వకంగా అనలేదు.. వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా”
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. “ప్రతిపక్షాన్ని రాజకీయంగా విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప, ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా కింది స్థాయికి దిగజారి మాట్లాడాలనే కోరిక నాకు లేదు. ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది” అని అన్నారు.

కేటీఆర్ గారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ వ్యక్తిగతంగా బాధపెట్టాలని లేదా వారి ప్రతిష్టకు భంగం కలిగించాలని తాను ఏమాత్రం భావించలేదని స్పష్టం చేశారు. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వివాదంపై కొండా సురేఖ స్వయంగా ముందుకు వచ్చి క్షమాపణలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే దానికి చింతిస్తున్నానని ఆమె పునరుద్ఘాటించారు.







