బ్యాంకు నిర్లక్ష్యంతో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ ఈక్షణం, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్స్ మరియు ‘డిజిటల్ అరెస్టు’ (Digital Arrest) బాధితులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పు వెలువరించింది. సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బు కాజేసినప్పుడు, ఆ ఘటనలో బ్యాంకుల నిర్లక్ష్యం లేదా వైఫల్యం ఉంటే ఆ నష్టాన్ని బ్యాంకులే భరించాలని, బాధితులకు పరిహారం చెల్లించాలని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

డిజిటల్ బ్యాంకింగ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఆర్థిక సంస్థలకు జవాబుదారీతనం ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆన్‌లైన్ మోసాలు, అనుమానాస్పద లావాదేవీల (Unwanted Transactions) బారిన పడి ఖాతాదారులు సర్వస్వం కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఖాతాదారుల ప్రమేయం లేకుండా జరిగే అనధికారిక, అనుమానాస్పద లావాదేవీలను బ్యాంకులు తక్షణమే తాత్కాలికంగా నిలిపివేయాలని (Freeze/Hold) తేల్చిచెప్పింది.

మోసపూరిత లావాదేవీలను ఆటోమేటిక్‌గా గుర్తించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన సాంకేతిక భద్రతా విధానాలను బ్యాంకులు విధిగా అమలు చేయాలని ఆదేశించింది.

ప్రధాన మార్గదర్శకం: బ్యాంకు వైఫల్యం వల్ల పోగొట్టుకున్న డబ్బుకు బ్యాంకులే బాధ్యత వహించి పరిహారం చెల్లించాలి.

ఆర్బీఐకి ఆదేశాలు: బ్యాంకింగ్ రంగంలో జవాబుదారీతనం పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ తక్షణ చర్యలు తీసుకోవాలి.

సాంకేతిక భద్రత: అన్‌వాంటెడ్ లావాదేవీలను ఆటోమేటిక్‌గా గుర్తించి, వెంటనే నిలిపివేసేలా ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి.

బాధితులకు రక్షణ: పెరుగుతున్న డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాల నేపథ్యంలో సామాన్యులకు భద్రత కల్పించేలా తీర్పు.

ప్రస్తుత కాలంలో సైబర్ కేటుగాళ్లు ప్రజలను రకరకాలుగా బెదిరించి, డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, మోసం జరిగిన వెంటనే బాధితులు బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినప్పటికీ డబ్బు రికవరీ కావడం లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పు బ్యాంకుల బాధ్యతను మరింత పెంచడమే కాకుండా, డిజిటల్ మోసాల బాధితులకు పెద్ద ఊరటనిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.