కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పనిచేయాలి: జిల్లా ఎస్పీ

నల్లగొండ ఈక్షణం, అక్టోబర్ 31: కోర్టుల్లో కేసుల విచారణ సమయంలో నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే ‘కన్విక్షన్’ (Conviction) శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు పూర్తి సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో ఆయన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేసుల విచారణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, సమర్పించే ప్రతి ఆధారంలోనూ పక్కాగా వ్యవహరించాలని అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

దర్యాప్తు సమయంలో పోలీసులు సేకరించిన కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు మరియు ఇతర పత్రాలను కోర్టులో సమర్పించే సమయంలో ఎలాంటి వ్యత్యాసాలు రాకుండా దర్యాప్తు అధికారులతో కోర్టు డ్యూటీ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో (Public Prosecutors) ముందస్తుగా మాట్లాడి, విచారణకు అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

అలాగే కోర్టుల నుంచి జారీ అయ్యే సమన్లు, వారెంట్ల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాక్షులు నిర్ణీత సమయానికి కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ముఖ్యంగా పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసులు మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కేసుల్లో విచారణ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా ప్రాసిక్యూషన్‌తో కలసి పనిచేయాలని చెప్పారు. కన్విక్షన్ శాతం పెంపునకు సమర్థవంతమైన సమన్వయం కనబరిచి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సీఐలు శ్రీను నాయక్, బీషన్నతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.