
రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు బిగ్ షాక్..
- మైనర్ బాలికతో షూటింగ్..తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు..
- జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి, 20 శాతం ఫిక్స్డ్ డిపాజిట్‌పై ప్రశ్నల వర్షం..
- నవంబర్ 4న ఆధారాలతో విచారణకు హాజరు కావాలని ఆదేశం..
హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 31: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ తీవ్ర షాక్ ఇచ్చింది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక మైనర్ బాలికను భాగస్వామ్యం చేయడంపై చట్టపరమైన నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో సినిమా నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు.
మైనర్ చైల్డ్ ఆర్టిస్టుల రక్షణ, భద్రత మరియు చదువుకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు.
బాలకార్మిక చట్టాల ఉల్లంఘనపై ప్రశ్నల వర్షం!
సినిమా షూటింగ్లో మైనర్ బాలిక నటించడానికి ముందు చట్టప్రకారం తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ మూవీ టీమ్‌ను పలు ఘాటైన ప్రశ్నలు అడిగారు:
జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి: బాలిక సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ముందు సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ (DM) నుండి అధికారిక అనుమతి తీసుకున్నారా?
తల్లిదండ్రుల సమ్మతి: బాలిక తల్లిదండ్రుల నుండి చట్టబద్ధమైన అధికారిక సమ్మతి పత్రాన్ని (Consent Letter) పొందారా?
చదువు & సంక్షేమం: షూటింగ్ సమయంలో బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని (Caretaker) నియమించారా?
పని గంటలు & రికార్డులు: బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులు, రోజువారీ షూటింగ్లో పాల్గొన్న పని గంటల వివరాలను స్పష్టం చేయాలని ఆదేశించారు.
20 శాతం పారితోషికం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా?
చైల్డ్ ఆర్టిస్టుల హక్కుల పరిరక్షణ నిబంధనల ప్రకారం.. మైనర్ బాలికకు ఇచ్చే మొత్తం పారితోషికంలో (Remuneration) 20 శాతం మొత్తాన్ని ఆమె పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా లేదా అనే దానిపై కూడా అధికారులు స్పష్టత కోరారు. అంతేకాకుండా, సినిమా ప్రమోషన్ ఈవెంట్లు మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మైనర్ బాలికను పాల్గొనేలా చేయడంపై కూడా తగిన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు, అనుమతి పత్రాలతో నవంబర్ 4వ తేదీ ఉదయం 11:00 గంటలకు తమ ముందట విచారణకు హాజరు కావాలని ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సినీ పరిశ్రమలో మైనర్ ఆర్టిస్టుల వినియోగంపై కార్మిక శాఖ కఠిన వైఖరి అవలంబించడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.







