నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరు..

నల్గొండ ఈక్షణం, అక్టోబర్ 31: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రస్థానంలో మరో సంచలనాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికలో భాగంగా ప్రసిద్ధ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన పరిపాలనా ఆమోదం (Administrative Sanctions) లభించడంతో పనులు వేగవంతం కానున్నాయి.

ఈ సందర్భంగా శనివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్‌లో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి పనుల ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు.

క్లాక్ టవర్ సెంటర్‌లోని పాత ఆర్ అండ్ బి (R&B) కార్యాలయ స్థలంలో అత్యంత అధునాతన రీతిలో షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మాణం మరియు చుట్టూ ఉన్న పరిసరాల సుందరీకరణ పనులను చేపట్టనున్నారు.

ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు (World Bank) రూ. 138.21 కోట్లు సమకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 59.23 కోట్లు కేటాయించింది. మొత్తం రూ. 197.44 కోట్ల భారీ బడ్జెట్‌తో నల్గొండ గుండెకాయ లాంటి క్లాక్ టవర్ సెంటర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించనున్నారు.

నల్గొండ పట్టణ ముఖచిత్రాన్ని మార్చేలా సుందరీకరణ ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నల్గొండను నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.