
నాలుగేళ్లుగా నిరుపయోగంగా డబుల్ వెంట్ బాక్సులు!
- రూ.3.5 కోట్ల ప్రజాధనం వృథా కాకుండా చూడాలి
- రైల్వే అండర్ బ్రిడ్జిని డబుల్ వెంట్‌గా నిర్మించాలి: మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ, ఈక్షణం: నల్లగొండ–హైదరాబాద్ రోడ్డులోని రైల్వే అండర్ బ్రిడ్జిని డబుల్ వెంట్‌గా నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఆ నిధులతో తయారు చేసిన డబుల్ వెంట్ బాక్సులు ఇప్పటికీ వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అండర్ బ్రిడ్జిని పరిశీలించి రైల్వే ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హైదరాబాద్ రోడ్డును ఆరు వరుసల రహదారిగా విస్తరించే పనులు చేపట్టినప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జిని సింగిల్ వెంట్‌తో నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదించారని భూపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అధిక ట్రాఫిక్ ఉంటుందని, సింగిల్ వెంట్ కారణంగా ప్రమాదాలతోపాటు తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసి పనులను నిలిపివేయించినట్లు చెప్పారు.

అనంతరం రైల్వే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను గుర్తించారని, డబుల్ వెంట్ నిర్మాణానికి అంగీకరించారని తెలిపారు. అయితే ఇందుకు అవసరమైన నిధులు లేవని అధికారులు చెప్పడంతో అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. ఆ నిధులతో డబుల్ వెంట్‌కు అవసరమైన బాక్సులను కూడా తయారు చేశారని పేర్కొన్నారు.
అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఆ బాక్సులను ఏర్పాటు చేయకపోవడంతో రహదారి ఇరుకుగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సింగిల్ వెంట్తోనే రహదారి నిర్మించే అవకాశం ఉందని తెలిసిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటికే తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి డబుల్ వెంట్ రహదారిని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, రేగట్టె మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







