
ఉత్తమ్‌పై జగదీశ్‌రెడ్డి నిప్పులు.. సాగర్ జలాలపై నిలదీత!
- కేఆర్‌ఎంబీకి రాసిన లేఖ ఎప్పుడు రాశారో బయటపెట్టాలి..
- లేదంటే జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- చంద్రబాబుకు తెలంగాణ నీళ్లను తాకట్టు పెట్టారు..
- కాంగ్రెస్ పాలనలో ఆంధ్రా కనుసన్నల్లోనే వ్యవహారాలు
- సాగర్ జలాల కోసం ఎంతకైనా పోరాడతాం..
- భూకంపం సృష్టించైనా హక్కులు కాపాడుకుంటాం..
గట్టుప్పల్, ఈక్షణం: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. సాగర్ నీటి తరలింపుపై కేఆర్‌ఎంబీకి ఉత్తమ్ రాసిన లేఖను ఎప్పుడు పంపించారో బహిర్గతం చేయాలని, లేనిపక్షంలో ముక్కు నేలకు రాసి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు వేర్వేరుగా ప్రకటనలు చేస్తున్నారని, వాటిలో ఏది నిజమో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. గురువారం గట్టుప్పల్ మండల కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
సమైక్యాంధ్ర పాలనలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా నాగార్జునసాగర్ నీటిని ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతోందని ఆరోపించారు. పల్నాడు జిల్లా విజయపురి సౌత్ వద్ద ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ పనులు చేపడుతున్నా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చేతగాని, అనర్హమైన మంత్రిని ఇప్పటివరకు చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటిని చంద్రబాబుకు తాకట్టు పెట్టి, ఇక్కడి రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించడం ఏమిటని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు.
ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారు దోచుకోవడం, కమీషన్లు మింగడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు పాలన ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రాప్ హాలిడే ప్రకటించకుండా తెలంగాణలోనే ఎందుకు ప్రకటిస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో పాలన చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు బీఆర్‌ఎస్ ఎంతకైనా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే భూకంపం సృష్టించైనా సాగర్ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని జిల్లా ప్రజలు క్షమించరని, రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.







