Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డికి సొంత పార్టీ సెగ!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: ఇన్నాళ్లూ ప్రభుత్వంపై విమర్శలు.. ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఎదురు దాడి! మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ పరిణామాలకు తెరతీస్తోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పనితీరు, నిధుల కేటాయింపుపై ఆయన చేస్తున్న విమర్శలకు తాజాగా సొంత పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నరు. ఆగస్టులో ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేయగా.. ఇప్పుడు నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌నేత నేరుగా రంగంలోకి దిగి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి పదవి రాలేదని, కాంట్రాక్టులు దక్కలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏఐసీసీ, టీపీసీసీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. దీనికి కోమటిరెడ్డి వర్గం కూడా దీటుగా స్పందించడంతో జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిరంగ పోరుగా మారాయి. మరోవైపు ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి చేరడంతో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు పైన గత కొంత కాలంగా రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి సొంత జిల్లా, మంత్రుల నియోజకవర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలుమార్లు విమర్శించారు. మునుగోడుతో పాటు జిల్లాలో అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు కేటాయించడం లేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగానూ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు సంధించారు. ఇటీవల ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగింది. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేయడంతో పాటు మంత్రుల వ్యవహారశైలినీ తప్పుబట్టారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిబంధనలు పెడుతూ, మరోవైపు కొందరు అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.

ఆగస్టులోనే హెచ్చరికలు..

రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ నేతల్లో అసంతృప్తి ఆగస్టులోనే బహిర్గతమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేయడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే బాలూనాయక్‌ తదితరులు ఘాటుగా స్పందించారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దానికి హద్దులు ఉండాలని, మైక్‌ దొరికినప్పుడల్లా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా వ్యవహరించే వారిపై ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొండా సురేఖ, ఆమె కూతరు సుస్మిత ఇతర నేతల వ్యవహారాలు కూడా తెరపైకి రావడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే రాజగోపాల్‌ రెడ్డి విమర్శల పరంపర మాత్రం కొనసాగింది.

ఆగస్టు నాటి హెచ్చరికల తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న వ్యవహారం తాజాగా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్‌నేత ప్రెస్‌మీట్‌తో మళ్లీ వేడెక్కింది. రాజగోపాల్‌రెడ్డి పార్టీపై, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించిన ఆయన.. సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి రాలేదని, కాంట్రాక్టులు దక్కలేదని ప్రభుత్వాన్ని విమర్శించడం వెనుక ఉద్దేశమేమిటని సూటిగా ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి పేరుతో మంత్రి పదవి గోడు చెప్పుకుంటున్నారని, జిల్లా కాంగ్రెస్‌ వ్యవహారాల్లోనూ రాజగోపాల్‌ చొరవ చూపడం లేదని, పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, కార్యకర్తల సమస్యలపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. బీజేపీ నుంచి వచ్చిన వారికి మున్సిపల్‌ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, పార్టీ పదవులు ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. చివరకు రాజగోపాల్‌రెడ్డిపై ఏఐసీసీ, టీపీసీసీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ప్రకటించారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే కైలాష్ నేత రాజగోపాల్ పైన వ్యాఖ్యలు చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టుగానే చెప్పడం జరిగింది.

కైలాష్‌ విమర్శలు నల్గొండ కాంగ్రెస్‌లో మరో వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను కోమటిరెడ్డి బ్రదర్స్‌ వర్గం తీవ్రంగా తప్పుబట్టింది. కైలాష్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. మునుగోడు, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ నివాసంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు మద్దతుగా ఉన్న నేతలు మీడియా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిలో వేముల వీరేశం నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పాత కాంగ్రెస్‌ వర్గీయులు ఉండటం గమనార్హం. దీంతో రాజ గోపాల్‌ రెడ్డిపై విమర్శలతో మొదలైన వ్యవహారం.. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లోని వర్గాల మధ్య ఆధిపత్య పోరును మరోసారి తెరపైకి తెచ్చింది.

ఇటీవల సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా వ్యవహరిస్తున్నారన్న సంకేతాలు ఇచ్చారనే చర్చ సాగింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ సైతం పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గతంలోనే స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యవహారం సమయంలోనూ పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా స్పష్టం కాలేదు.

ఇప్పటివరకు రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. సొంత పార్టీ నేతలు మౌనం పాటించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆగస్టులో విప్‌లు, ఎమ్మెల్యేల హెచ్చరికలతో మొదలైన ఎదురుదాడి.. తాజాగా డీసీసీ అధ్యక్షుడి బహిరంగ విమర్శలు, కోమటిరెడ్డి వర్గం కౌంటర్‌తో మరో దశకు చేరింది. ఒకవైపు ప్రభుత్వంపై రాజగోపాల్‌రెడ్డి విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు ఆయన తీరును తప్పుబడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. కైలాష్‌ ప్రకటించిన ఫిర్యాదుపై ఏఐసీసీ, టీపీసీసీ ఎలా స్పందిస్తాయి? పార్టీ క్రమశిక్షణ పేరుతో ఎలాంటి చర్యలుంటాయి? రాజగోపాల్‌రెడ్డి తన వైఖరిని మార్చుకుంటారా? అన్నది ఇప్పుడు కీలకం. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై ఆయన వినిపించిన విమర్శలకు ఇప్పుడు సొంత పార్టీ నుంచే కౌంటర్ గా వినిపిస్తోంది.