
Eekshanam Exclusive: ఇరిగేషన్ వర్సెస్ ఇంటెలిజెన్స్!
- నాగార్జునసాగర్‌లో రెండు శాఖల మధ్య సమన్వయ లోపం
- పల్నాడు ప్రాజెక్టు పనులు జరుగుతున్నా నిఘా వర్గాలకు సమాచారం లేదా?
- ఎస్ఈ మల్లికార్జునరావు వ్యవహారశైలిపై ఆరా
- అవినీతి ఆరోపణలపైనా ఇంటెలిజెన్స్ కూపీ లాగుతోందా?
- గతంలోనూ సమాచారం గోప్యంగా ఉంచారన్న ఆరోపణలు
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు తాగునీటి పథకం పనుల వ్యవహారం తెలంగాణలోని రెండు కీలక శాఖల మధ్య సమన్వయ లోపాన్ని తెరపైకి తెస్తోంది. సాగర్ ఇరిగేషన్ సర్కిల్, నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ విభాగం మధ్య సమాచార మార్పిడి సరిగా జరగడం లేదన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాగర్ రైట్ కెనాల్ వైపు ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులపై ఇరిగేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ నిఘా వర్గాలకు ఎందుకు చేరలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల భద్రతకు సంబంధించిన కీలక అంశాల్లో ఇంతటి సమాచార అంతరం ఎలా ఏర్పడిందన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
సమాచారం ఎందుకు చేరలేదు?
నాగార్జునసాగర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన జలవనరు. ఇక్కడ జరిగే నిర్మాణాలు, నీటి తరలింపు ప్రయత్నాలు, ప్రాజెక్టు పరిసరాల్లోని కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. అలాంటి కీలక ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం పల్నాడు తాగునీటి పథకం పేరుతో పనులు చేపడుతున్న వ్యవహారం నిఘా వర్గాల దృష్టికి ముందుగానే ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. సాగర్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో ఇంజినీరింగ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నప్పటికీ.. అక్కడ జరుగుతున్న పనులపై ఇంటెలిజెన్స్‌కు సరైన సమాచారం అందకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు సమాచారాన్ని తమ పరిధిలోనే దాచిపెట్టారా? లేక నిఘా వ్యవస్థ క్షేత్రస్థాయి పర్యవేక్షణలో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎస్ఈ వ్యవహారశైలిపై ఆరోపణలు
సాగర్ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ మల్లికార్జునరావు వ్యవహారశైలిపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది. గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసినప్పటి నుంచే ఆయన ఇంటెలిజెన్స్ వర్గాలకు సరైన సమాచారం అందించేవారు కాదని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఫోన్ చేసినా స్పందించక పోవడం, సమాచారం అడిగితే వివరాలు వెల్లడించకుండా దాటవేయడం వంటి ధోరణి కారణంగా సాగర్ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై నిఘా వర్గాలకు పూర్తి సమాచారం అందేది కాదని అంటున్నారు. ఈఈగా పనిచేసిన ఆయనకు అదే ప్రాంతంలో ఎస్ఈగా పదోన్నతి కల్పించి కొనసాగించడంపైనా ఇరిగేషన్ శాఖలో పరిపాలనాపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎస్ఈ అవినీతి చిట్టాపై కూపీ?
పల్నాడు ప్రాజెక్టు వ్యవహారంతో పాటు సాగర్ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ మల్లికార్జునరావుకు సంబంధించిన ఇతర వ్యవహారాలపైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో నిర్వహించిన విధులు, ఇంజినీరింగ్ పనుల నిర్వహణ, టెండర్లు, కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈఈగా, ప్రస్తుతం ఎస్ఈగా పనిచేసిన కాలంలో ఆయన వ్యవహారశైలి, ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ సమాచారం సేకరిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిఘా వర్గాల సమాచారం సేకరణ ఏ మేరకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ అధికారులతో సత్సంబంధాలు?
మల్లికార్జునరావుకు ఏపీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు, ఇతర అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఏపీ నుంచి అధికారులు తరచూ సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాలకు వచ్చిపోతుంటారని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ తెలంగాణ పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలను కనీసం డ్యామ్ వైపు వెళ్లేందుకు కూడా అనుమతినిచ్చే వాడు కాదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జునరావు, అతని కింద పనిచేసే ఉద్యోగుల పైన వేధింపులకు గురిచేసే వారని, ఇంటిలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న కీలక ప్రాజెక్టు పరిధిలో అధికారుల మధ్య సమాచార మార్పిడి, పర్యవేక్షణ ఎలా జరుగుతున్నాయన్న అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వ్యక్తిగత సంబంధాల కారణంగానే సమాచారం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.
మూడు మండలాలకు ఒక్కరే కానిస్టేబుల్!
మరోవైపు ఇంటెలిజెన్స్ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో సతమత మవుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. మూడు మండలాల పరిధిలోని పరిణామాలను పర్యవేక్షించేందుకు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే అందుబాటులో ఉంటే అన్ని అంశాలపై నిరంతర నిఘా సాధ్యమవుతుందా? ప్రభుత్వ పథకాల అమలు, అధికారుల పనితీరు, రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అనేక బాధ్యతలు ఉండటంతో ప్రతి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు గుర్తించడం కష్టమవుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో జేఈ, డీఈ, ఈఈ, ఎస్ఈ స్థాయిలో యంత్రాంగం ఉన్న ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న కీలక పనుల సమాచారం కూడా బయటకు రాకపోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోతిరెడ్డిపాడు విషయంలో అలా.. సాగర్‌లో ఇలా!
గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై విచారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ బృందం ప్రత్యేకంగా నందికొట్కూరుకు వెళ్లిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగుల సహకారంతో పనుల వివరాలు, నిర్మాణ పురోగతికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. అవసరమైనప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి సమాచారాన్ని సేకరించిన నిఘా విభాగానికి.. తెలంగాణ సరిహద్దులోనే ఉన్న సాగర్ పరిధిలో పల్నాడు పథకం పనుల సమాచారం ఎందుకు అందలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇప్పుడు ఎవరిపై బాధ్యత?
పల్నాడు పథకం పనుల వ్యవహారంలో ఇరిగేషన్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగం పరస్పరం బాధ్యతను ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు సమాచారం అందించలేదన్నది ఒకవైపు ఆరోపణ కాగా.. కీలకమైన అంతర్రాష్ట్ర ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులను గుర్తించ లేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహారశైలి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు, గతంలో సమాచార మార్పిడి ఎలా ఉండేది, పల్నాడు పథకం పనులపై ఎప్పటి నుంచి ఎవరికి సమాచారం ఉందన్న అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సాగర్‌లో అసలు లోపం ఇరిగేషన్ శాఖ సమాచార గోప్యతలో ఉందా? ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉందా? లేక రెండు శాఖల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమా? అన్నది తేలాల్సి ఉంది.







