
Eekshanam Exclusive: వంద సీట్ల కోసం వెంకట్‌రెడ్డి వ్యూహమేంటి?
- సీఎం టార్గెట్ 90.. మంత్రి లక్ష్యం 100!
- 34 అసెంబ్లీ సెగ్మెంట్లపైనే గురి?
- గ్రాడ్యుయేట్ ఎన్నికల కార్యాచరణపై సందీప్‌తో చర్చలు
- నల్లగొండ కేంద్రంగా రాజకీయ వ్యూహానికి పదును?
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 90 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తన ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ వంద స్థానాల్లో గెలుపొందుతుందని ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి లక్ష్యాన్ని మించి మంత్రి మరో పది స్థానాల అంచనాను వ్యక్తం చేయడం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేమిటన్న చర్చ మొదలైంది.
34 అసెంబ్లీ సెగ్మెంట్లపైనే గురి?
హైదరాబాద్, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లా రాజకీయంగా కీలకంగా ఉండటంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని కోమటిరెడ్డి ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 34 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని ఎలా పెంచుకోవాలి? రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న అంశాలపై ఆయన దృష్టి సారించినట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పార్టీకి వ్యతిరేకత లేదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది.
గ్రాడ్యుయేట్ ఎన్నికలపైనా కార్యాచరణ
అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా కోమటిరెడ్డి కీలకంగా పరిగణిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. హైదరాబాద్, నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నట్లు వెల్లడించారు. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సందీప్‌తో ఈ అంశంపై మాట్లాడనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను చేరుకోవడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, ఆయా నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ బలాన్ని పెంచడం వంటి అంశాలపై ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం లెక్కలు వేరు.. మంత్రి లెక్కలు వేరా?
2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలు సాధిస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 90 స్థానాల లక్ష్యాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇద్దరి ప్రకటనల్లోనూ కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ, మంత్రి చెబుతున్న వంద సీట్ల ప్రణాళికలోని అసలు రాజకీయ లెక్కలేమిటన్నది ఆసక్తిని రేపుతోంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు గ్రాడ్యుయేట్ ఎన్నికల కార్యాచరణను సమన్వయం చేయడం ద్వారా రాజకీయంగా ఎలాంటి ఫలితాలు సాధించాలనుకుంటున్నారు? నల్లగొండ కేంద్రంగా ఆయన ముందుకు తీసుకెళ్లబోయే వ్యూహం ఏమిటి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







